నేటి నుంచి..
● స్పీకర్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం
భువనేశ్వర్: ఈ నెల 22 మంగళవారం నుంచి రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆమె చాంబరులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభా కార్యకలాపాలు క్రమబద్ధంగా సాగేందుకు స్పీకరు అధికార, ప్రతిపక్ష సభ్యుల సహకారం కోరారు. స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన సోమవారం జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, విపక్ష బిజూ జనతా దళ్ శాసన సభ పక్ష ఉప నాయకుడు డాక్టర్ ప్రసన్న ఆచార్య, ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, డిప్యూటీ చీఫ్ విప్ ప్రతాప్ కేశరి దేవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించేందుకు వీలుగా అఖిల పక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. సమావేశాల్లో ఎంఎండీఆర్ సవరణ చట్టం, 2026 విషయంలో వాడీవేడిగా చర్చ సాగే అవకాశం ఉంది. ఈ చట్టం, ఖనిజ సంపదతో తులతూగుతున్న ఒడిశాపై విపరీత ప్రభావం చూపుతుందని విపక్షాలు తొలి నుంచి విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సభలో ప్రభుతాన్ని నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం బిజూ జనతా దళ్‌తో కాంగ్రెస్ ఏకీభవించి తొడగొడుతున్నాయి. ఈ విషయమై ప్రతిపక్ష ఉప నాయకుడు డాక్టరు ప్రసన్న ఆచార్య మాట్లాడుతూ బీజేడీ ఎంఎండీఆర్ అంశంపై వర్షా కాలం సమావేశాల ప్రారంభం నుంచే సభలో ప్రధాన అంశంగా ప్రస్తావిస్తుందని స్పష్టం చేశారు. కొత్త చట్టం కారణంగా మైనింగ్ సంబంధిత బకాయిల రూపంలో రాష్ట్రం దాదాపు రూ.1 లక్ష కోట్లు నష్టపోవచ్చని బీజేడీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ అంశంతోపాటు పాఠ్య పుస్తకాల్లోని తప్పులు, శాంతిభద్రతలు, వ్యవసాయ సంక్షోభం, మహిళల భద్రత, గిరిజన హక్కుల పరిరక్షణ వంటి ఇతర అంశాలను బీజేడీ ప్రధాన అంశాలుగా పరిగణించి సభలో చర్చకు ప్రేరేపిస్తుంది. ఎంఎండీఆర్ సవరణ విషయంలో కాంగ్రెస్ సభ్యులు కూడా సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధత వ్యక్తం చేసింది. ఈ స్వల్పకాలిక సమావేశంలో పాఠ్యపుస్తకంలోని తప్పులు, శాంతిభద్రతలు వంటి ప్రధాన అంశాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చకు ప్రాధాన్యత కల్పిస్తారని కాంగ్రెసు శాసన సభా నాయకుడు రామచంద్ర కదమ్ తెలిపారు. మరోవైపు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆధ్వర్యంలో బీజేపీ శాసన సభ పక్షం సోమవారం సమావేశమై ప్రతిపక్షాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక ప్రణాళిక ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. శాసన సభ సచివాలయం జారీ చేసిన తాత్కాలిక షెడ్యూలు ప్రకారం 17వ శాసన సభ ఏడో సమావేశాలు మంగళ వారం నుంచి ప్రారంభమమై అక్టోబర్ 3 వరకు కొనసాగుతాయి. ఈ నెల 25, శుక్రవారం ప్రైవేట్ సభ్యుల కార్యకలాపాలు, ప్రతిపాదిత బిల్లులు, తీర్మానాల కోసం కేటాయించారు. సెప్టెంబర్ 26, 27 తేదీలలో సమావేశాలు ఉండవు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీని సెలవు దినంగా పాటిస్తారు.


