శ్రీ జగన్నాథ దర్శన్‌ యోజన కింద వయో వృద్ధుల శ్రీక్షేత్ర యాత్ర | - | Sakshi
Sakshi News home page

శ్రీ జగన్నాథ దర్శన్‌ యోజన కింద వయో వృద్ధుల శ్రీక్షేత్ర యాత్ర

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

భువనేశ్వర్‌: రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, మిషన్‌ శక్తి, పర్యాటక శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా శ్రీ జగన్నాథ దర్శన్‌ యోజన కింద 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి శ్రీక్షేత్ర యాత్రను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఒడిశా రాష్ట్ర పర్యాటక శాఖ, ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్‌ఆర్‌ టీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. శ్రీక్షేత్ర యాత్ర మొదటి విడతలో మల్కన్‌గిరి, కొరాపుట్‌, నవరంగ్‌పూర్‌ జిల్లాలకు చెందిన 910 మంది వయోవవృద్ధులు పూరీకి వెళ్లి, శ్రీక్షేత్రంలో మహా ప్రభువు శ్రీ జగన్నాథుని దర్శనం చేసుకుంటారని మంత్రి ప్రభాతి పరిడా తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ఒడిశా వాసికి రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని దర్శనం చేసుకునే ఆధ్యాత్మిక ఆకాంక్షను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వయో వృద్ధులు శ్రీక్షేత్రాన్ని సందర్శించి జగతి నాథుని ఆశీస్సులు పొందేందుకు ఈ కార్యక్రమం ఒక పవిత్రమైన అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పథకం మొదటి దశలో భాగంగా ఈ నెల 20 నుంచి అక్టోబర్‌ 26 మధ్య 13 జిల్లాల నుంచి సమగ్రంగా 10,434 మంది యాత్రికులు పూరీని సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. మొదటి విడత యాత్రలో 910 మంది యాత్రికులు పాల్గొన్నారు. వీరిలో మల్కన్‌గిరి నుండి 490 మంది, కొరాపుట్‌ నుంచి 210 మంది, నవరంగ్‌పూర్‌ నుంచి 210 మంది ఉన్నారు.

యాత్రికుల భద్రత, సంక్షేమం పర్యవేక్షణ కోసం ఒక్కో బస్సులో 3 మంది ఎస్కార్ట్‌ అధికారులు, ఒక పారామెడికల్‌ సిబ్బందిని నియమించారు. వీరు యాత్ర ఆద్యంతాలు యాత్రికులతో ఉంటూ, వారి ఆరోగ్యం మరియు ఇతర అవసరాలను పర్యవేక్షిస్తారు. శ్రీ జగన్నాథ దర్శన్‌ యోజన కింద 1 లక్ష మంది వయోవృద్ధులకు శ్రీ జగన్నాథ ఆలయంలోని త్రిమూర్తుల (జగన్నాథ, బలభద్ర, దేవీ సుభద్ర) దర్శన భాగ్యం కల్పించడం లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,000 మంది అర్హులైన లబ్ధిదారుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కింద యాత్రికులకు వారి సంబంధిత గ్రామ పంచాయతీల నుంచి జిల్లా కేంద్రానికి తరలించి ఆపై ప్రత్యేక బస్సుల ద్వారా పూరీకి రవాణా సదుపాయం కల్పిస్తారు. శ్రీ జగన్నాథ ఆలయ దర్శన ఏర్పాట్లతో పాటు ఈ ప్యాకేజీలో ఉచిత ఆరోగ్య పరీక్షలు, రోజుకు 4 సార్లు శాకాహార భోజనం, కిట్‌ బ్యాగులు, గుర్తింపు కార్డులు జారీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement