బిసంకటక్‌లో 49 వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బిసంకటక్‌లో 49 వినతుల స్వీకరణ

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

రాయగడ: జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లాలోని బిసంకటక్‌ సమితి కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా 49 వినతులను అధికారులు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ నిహారి రంజన్‌ కుహరో అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. అందిన వినతుల్లో 36 వ్యక్తిగత, 13 సామాహిక వినతులు ఉన్నాయి. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్‌లో సచిన్‌ అన్నా సాహెబ్‌ ఆహలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్‌ విశ్వంబర్‌ బెహర, తహసీల్దార్‌ కె.వెంకటేశ్వర్‌రెడ్డి, బీడీవో శివప్రసాద్‌ పట్నాయక్‌ ఉన్నారు.

కేరళలో ఒడిశా కార్మికుడి అనుమానాస్పద మృతి

రాయగడ: ఉపాధి కోసం సొంత ఊరిని వీడి ఇతర రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికుల కష్టాలు తీరడం లేదు. కుటుంబాన్ని పొషించేందుకు కేరళకు వెళ్లిన రాయగడ జిల్లా బిసంకటక్‌ ప్రాంతానికి చెందిన ఓ వలస కార్మికుడు అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లాలోని బిసంకటక్‌ సమితి పరిధిలోని డుకుం గ్రామానికి చెందిన రమేష్‌ కౌసల్య కొడుకు మిలన్‌ కౌసల్య (25) కేరళలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం అతడు మృతి చెందినట్లు సమాచారం. అయితే అతడి మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. మిలన్‌తో కలసి పనిచేస్తున్న ఇతర ఒడిశా కార్మికులు ఈ విషయాన్ని ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంతో వెంటనే కేరళకు బయల్దేరారు. అక్కడికి చేరుకున్న అనంతరం అక్కడి పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వారికి అప్పగించినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన డుకుంకు తీసుకురానున్నారు.

గజపతి జిల్లాలో సర్‌ తుది జాబితా విడుదల

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో సర్‌–2026 కింద సిద్ధం చేసిన ఓటర్ల తుది జాబితాను సోమవారం కలెక్టరేట్‌లో అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. ఈ తుది ఓటర్ల జాబితా విడుదలలో ఎన్నికల శాఖ డిప్యూటీ కలెక్టర్‌ అమిత్‌ బిశ్వాల్‌, డిప్యూటీ కలెక్టర్‌ కృతి శాయి శుక్లా, బీజేడీ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్‌ నాయక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్‌ శోబర, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బర్నాల జనార్ధనరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. బరంపురం పార్లమెంటరీ స్థానంలో గజపతిలో రెండు శాసనసభ నియోజకవర్గాలు 136– మోహనా (ఎస్సీ), 137– పరా్‌ల్‌ఖిముండి నియోజకవర్గాల్లో ప్రీ ఎస్‌ఐఆర్‌లో మోహనలో 2,46,595 ఓటర్లు ఉండగా, ఫైనల్‌ పబ్లికేషన్‌లో 2,32,662 మంది ఉన్నారు. అలాగే పర్లాకిమిడి నియోజికవర్గంలో ప్రీ ఎస్‌ఐఆర్‌లో 216,738 ఉండగా, ఫైనల్‌ పబ్లికేషన్‌లో 2,01, 290 మంది మిగిలారు. మొత్తం గజపతి జిల్లాలో ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ తుది జాబితాలో 4,33,952 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 14,628 పర్మినెంటుగా ఓటర్లు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, 12,669 మంది మృతులు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సర్వేలో 2,450 మంది గైర్హాజరయ్యారు. కొత్తగా 1596 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు ఏడీఎం మునీంద్ర హానగ వెల్లడించారు. జిల్లాలో మొదటిసారిగా ఎస్‌ఐఆర్‌ కోసం స్వీప్‌ కార్యక్రమం ద్వారా వివిధ పాఠశాలల్లో ఓటరు నమోదు కార్యక్రమం, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు జాబితాలో నమోదు జరిగినట్టు అధికారులు తెలియజేశారు. అయితే జిల్లాలో మోహన బ్లాక్‌ చంద్రగిరి, మహేంద్రగడలో గత 76 ఏళ్లుగా నివాసం ఉంటున్న కొంతమంది టెబెటియన్‌ శరణార్థుల పేర్లు ఓటరు సంశోధన ప్రక్రియ ఎస్‌ఐఆర్‌ చోటుచేసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement