రాయగడ: ప్రత్యేక ఒటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనంతరం జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదలయ్యింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 6,71,378 మంది ఓటర్లు తుది జాబితాల్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండ టం విశేషం. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహిస్తున్న అశుతోస్ కులకర్ణి అధ్యక్షతన సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో తుది ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జాబితా హర్డ్ కాపీతో పాటు సాప్ట్ కాపీ ని పెన్‌డ్రైవ్ ద్వారా అందించారు. సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు జిల్లాలోని గుణుపూర్, రాయగడ, బిసంకటక్ శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 7,14,700 మంది ఓటర్లు ఉన్నారు. సవరించిన డ్రాప్ట్ జాబితాలో ఈ సంఖ్య 6,69,207కు చేరగా, తుది జాబితాలో 6,71,378 మందికి చోటు కల్పించారు. సవరణ ప్రక్రియలో వలసలు, అవసరమైన పత్రాలు అందుబాటులో లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి 1,47,367 మందికి విచారణ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం వారి వివరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. ఫారం–6, ఫారం–6ఏ, ఫారం–8 ద్వారా 2,537 మంది పేర్లను చేర్చగా ఎన్నిల అధికారుల ఆదేశాల మేరకు 366 మంది పేర్ల ను తొలగించారు. మరో 54 మంది అనర్హులుగా గు ర్తించారు. నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే గుణుపూర్ శాసన సభ నియోజకవర్గంలో 2,07,861 మంది, బిసంకటక్‌లో 2,20,950 మంది, రాయగడలో 2,42,567 మంది ఓటర్లతో మొత్తం జిల్లాలో 6,71, 378 మంది ఓటర్లు తుది జాబితాలో చోటు చేసుకున్నారు. వీరిలో 3,17,958 మంది పురుషులు, 3,53, 252 మంది మహిళలు, 168 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి 1,111గా నమోదయ్యింది. ఈ సందర్భంగా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలొ జిల్లాలో ఎలాంటి పెద్ద సమస్య లు తలెత్తలేదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్రనాథ్ కుహరో, అసిస్టెంట్ కలెక్టర్ బిచిత్రా శెఠిలు పాల్గొన్నారు.


