కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్
జిల్లా కలెక్టర్‌కు వినతుల సమర్పణ
రాయగడ: ఖనిజ వనరులపై రాష్ట్రాల హక్కులను పరిరక్షించడంతో పాటు గిరిజనులు, ఆదివాసీలు, ఖనిజ కార్మికుల ప్రయోజనాలను కాపాడేందు ఖనిజాలు, ఖనిజ పదార్ధాల సవరణ చట్టం–2026ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ నేతృత్వంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, పీసీసీ మాజీ అధ్యక్షులు నిరంజన్ పట్నాయక్, శరత్ పట్నాయక్, జయదేవ్ జెన్న, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి లాలాజీ దేశాయ్‌తొ పాటు రాయగడ, గుణుపూర్, బిసంకటక్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, సత్యజీత్ గొమాంగో, నీలమాధవ హికక తదితరులు పాల్గొన్నారు. ఖనిజ రంగంలో కేంద్ర ప్రభుత్వానికి మరింత అధికారం కల్పించే విధంగా నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల రాష్ట్రాల ఆఽర్థిక, పరిపాలన హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఖనిజ సంపదపై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను పరిరక్షించాలని కోరారు. అలాగే గిరిజనులు, ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాల కారణంగా వారి జీవనోపాధి, భూమి, పర్యావరణంపై ప్రభావం పడకుండా కఠినమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అటవీ, గిరిజనుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ఖనిజ సంపదలను ప్రైవేటీకరణకు అనుకూలంగా మార్చే చర్యలను వ్యతిరేకించిన ప్రతినిధులు, సహజ వనరులపై ప్రజలకు, రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాపాడాలని కోరారు. ఖనిజ ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఉపాధి, అభివృద్ధి, పునరావాసం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.


