పర్లాకిమిడి: అభిమాన సంఘాల ద్వారా పలువురికి రక్తదానం చేస్తూ.. ప్రజల అభిమానం చూరగొన్న మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన సంఘాల సభ్యులకు యాక్సిడెంట్ బీమా పథకం అమలు చేయడం అభినందనీయమని, ఏపీ అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గేదెల చైతన్య అన్నారు. స్థానిక రాజవీధిలో అన్నపూర్ణా ఫంక్షన్ హాల్‌లో చిరంజీవి అభిమానుల సంఘ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం పాలసీ డాక్యుమెంట్ల ప్రదానోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లడారు. చిరంజీవి అంటే తనకు ప్రాణమని, పాతపట్నం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడువేల ఓట్లు సంపాందించానన్నారు. అనంతరం పవన్ కల్యాణ్ తనను అటవీశాఖ కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా నియమించారన్నారు. జయపురం, బరంపురం, పర్లాకిమిడి చిరంజీవి అభిమానులకు రూ.5 లక్షల ప్రమాద బీమా పాలసీ డాక్యుమెంట్లను గేదెల చైతన్య, నిర్మలా శెఠి చేతుల మీదుగా అందజేశారు. మొత్తం 18 మంది లబ్ధిదారులకు ప్రమాద బీమా పథకం పాలసీ డాక్యుమెంట్లు అందుకున్నారు. ఈ ప్రమాద బీమా పథకం పాలసీల పంపిణీ సభలో పురపాలక సంఘం చైర్‌పర్సన్ నిర్మలా శెఠి, ఉపాధ్యక్షులు లెంక మధు, ఒడిశా చిరు అభిమానుల సంఘం అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు కన్నా, బరంపురం మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు అజయ్‌కుమార్, మెగా యూత్ చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర కో ఆర్డినేటరు ఎస్.గౌరీశంకర్ పాల్గొన్నారు. ఒడిశా చిరంజీవి అభిమాన సంఘం కార్యదర్శి అలిజింగి రాము అధ్యక్షత వహించారు.


