మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి బలదియాగూఢ గ్రామం వద్ద ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మల్కన్‌గిరి నుంచి జయపురం వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఓ చెట్టును ఢీకొట్టింది. అటుగా వస్తున్న స్థానికులు కొందరు చూసి వెంటనే డ్రైవర్‌ను మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
భువనేశ్వర్: ఆదివారం రాష్ట్రంలో ఖొర్దా, బౌధ్ జిల్లాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఖొర్దాలో 2 మంది, బౌధ్‌లో ఒకరు మరణించారు. మరొకని పరిస్థితి విషమంగా కొనసాగుతుంది. ఖుర్దాలో 16వ నంబరు జాతీయ రహదారిపై సరుకులతో వెళ్తున్న ట్రక్కును ఒక ట్రాలరు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాలరు డ్రైవర్, హెల్పర్ మృతి చెందారు. ఖుర్ధా టౌన్ ఠాణా పోలీసులు ప్రమాదం సంభవించిన ప్రాంతం తోటపడ చౌక్ సందర్శించారు. బౌధ్‌లో జరిగిన మరో ఘటనలో ఒక కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఫుల్బణి నుంచి బౌధ్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
మల్కన్‌గిరి: విద్యుత్ షాక్‌తో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి సదర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఐఎంఎస్‌టీ పాఠశాల ఎదురుగా ఉన్న ఓ మోటర్‌సైకిల్ గ్యారేజీలో ఆదివారం చోటుచేసుకోగా.. మాధవ్ ఓఝా (23) మృతి చెందాడు. మాధవ్ పోడియా సమితి ఎం.పి.వి.56 గ్రామానికి చెందిన యువకుడు. గత ఏడాది నుంచి గ్యారేజీలో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం విధుల్లో భాగంగా గ్యారేజీ తెరిచి శుభ్రం చేసే క్రమంలో ఎయిర్ కంప్రెసర్ మిషన్ బటన్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారిక స్థితిలో పడిపోయిన అతన్ని గ్యారేజీ యజమాని, స్థానికులు గమనించి మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బందికి గ్యారేజీకి సరఫరాను నిలిపివేశారు. మల్కన్‌గిరి పోలీసులు ఆస్పత్రికి చేరుకోని కేసు నమోదు చేశారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అమ్మాయిని వేధించిన
సైబర్ నేరగాడు అరెస్టు
పర్లాకిమిడి: అమ్మాయిని వేధించి సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టులు పెడుతున్న సైబర్ నేరగాడు గజపతి పోలీసులు అరెస్టుచేశారు. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లా సోరో పీఎస్ పరిధిలో నువాపూర్ గ్రామానికి చెందిన భరత్ కుమార్ మహారాణాను సైబర్ పోలీసులు ఈనెల 20, ఉదయం 9 గంటలకు అరెస్టుచేసి పర్లాకిమిడి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. వివరాలు ఇలా వున్నాయి. గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ రామగిరి గ్రామానికి చెందిన అర్చితా మాలి (26) కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల 2023లో చైన్నెకి వెళ్లి అక్కడ ఒక షాపింగ్ మాల్‌లో ఉద్యోగంలో చేరింది. కొన్నా ళ్ల తర్వాత బాలేశ్వర్ జిల్లా నువాపూర్‌కు చెందిన భరత్ కుమార్ మహారాణాతో పరిచయం ఏర్పడింది. తన స్నేహితులతో నివాసం వుంటున్న అర్చితా రెండేళ్ల తర్వాత ఉద్యోగం నచ్చక తిరిగి తన స్వగ్రామం రామగిరికి వచ్చింది. అప్పటి నుంచి ఈ భరత్ కుమార్ మహారాణా ఫోన్లు చేసి తిరిగి చైన్నె రావాల్సిందిగా చేశాడు. అమె ససేమిరా అనడంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పెట్టి హింసించాడు. దీంతో అర్చితా విసిగిపోయి పర్లాకిమిడి సైబర్ పోలీసు స్టేషన్‌లో భరత్‌కుమార్‌పై ఫిర్యాదుచేసింది. పోలీసుల ఈ సైబర్ కేసును దర్యాప్తు చేసి నిందితుడు భరత్ కుమార్ మ హారాణాను బాలేశ్వర్ జిల్లాలో పట్టుకుని పర్లాకిమిడి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితుడిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు.


