జయపురం: దేశ చరిత్రలో మైసూరు తర్వాత అంత గొప్పగా, ఆడంబరంగా జరిగే జయపురం దసరాను అంగరంగ వైభవంగా నిర్వహించాలని జయపురం సబ్‌డివిజన్ దసరా నిర్వహణ కమిటీ నిర్ణయించింది. నేడు స్థానిక పురపాలక సంస్థ కౌన్సిల్ సభా గృహంలో దసరా పూజ కమిటీ అధ్యక్షుడు, జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహిణీపతి అధ్యక్షతన జరిగింది. దసరా పూజలు సన్నాహక సమావేశంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రజా రంజకంగా నిర్వహించేంధుకు అన్ని కోణాలపైన సుదీర్ఘంగా సమావేశం చర్చించింది. అక్టోబర్ 3 వ తేదీన మూలాష్టమి నాడు దసరా ఉత్సవాలకు శ్రీకారం చుట్టాలని, ఆ నాటి నుంచి అవిభక్త కొరాపుట్ జిల్లాలలో గల పలు దేవతలను జయపురం దసరాకు ఆహ్వానించాలని సమావేశం నిర్ణయించింది. ప్రజల ఆరాద్య దేవి మా భగవతి పీఠంలో పూజలు చేసి దసరా పూజలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. దసరా సందర్భంగా వివిధ ఆలయాలల వద్ద భక్తులకు తాగు నీరు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు చేయాలని తీర్మానించింది. అక్టోబర్ 11 నుంచి 18 వ తేదీ వరకు మాభగవతీ మందిరం నుంచి మా విజయ దేవి జయపురంలో నగరసంచార కార్యక్రమం, జయపురం దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే వివిధ గ్రామ దేవతల లాఠీలు, లాఠీదారులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంపై సమావేశం చర్చించింది. అక్టోబర్ 16 వ తేదీ మహా అష్టమి రోజున మా దక్షిణ కాళీ దేవికి సునావేష కార్యక్రమం, అక్టోబర్ 19 వ తేదీన మా భగవతీ దేవి సునావేశ (బంగారు అలంకరణ) కార్యక్రమాలు, 18 వ తేదీన దసరా పొడియలో అపరాజిత పూజలు నిర్వహించేందుకు నిర్ణయించారు. దసరా ఉత్సవాల్లో 4 పూజా మండపాలను ఏర్పాటు చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. 20వ తేదీ రాత్రి అనాదిగా వస్తున్న సంప్రదాయంగా దసరా శోభాయాత్ర నిర్వహించ నున్నట్లు వెల్లడించారు. దసరా పొడియాలో రావణ దహణం అనంతరం శోభాజాత్రతో అపరాజితా పూజ ముగిస్తుందని తెలిపారు. అష్టమి, నవమి, దసమి రోజుల్లో పట్టణంలో మద్యం అమ్మకాలు బందు చేసేందుకు నిర్ణయించారు.


