రాయగడ: నషా రహిత సమాజంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వక్తలు అన్నరు. యువత మత్తు పదార్ధాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతో పాటు నషారహిత సమాజా నిర్మాణమే లక్ష్యంగా జిల్లా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నషా ముక్త యువ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కై లాస్‌పూర్ ప్రభుత్వ ఎస్‌ఎస్‌డీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మై భారత్ –రాయగడ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ పాడితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా యువజన అధికారి కిశోర్ భేముల్వాడా ముఖ్యఅతిథిగా హాజరై మత్తుపదార్ధాల వినియోగం వల్ల యువత, కుటుంబాలు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా నినాదాల రచన, క్విజ్ పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నషా ముక్తి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. మత్తుపదార్ధాల వ్యతిరేక అవగాహనలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. నషా రహిత సమాజ నిర్మాణం కోసం సందేశాలతో అవగాహన ర్యాలీ చేశారు.


