రాయగడ: రైలు ప్రయాణంలో ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన జిల్లాలోని మునిగుడ–అంబోదల స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. చైన్నె నుంచి బీహార్ వెళ్తున్న గర్భిణీ శనివారం అలప్పుజ–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా, రైలు మునిగుడ దాటిన కాసేపటికే ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని గమనించిన తోటి ప్రయాణికుల సాయంతో కదులుతున్న రైలులోనే ఆడ శిశివును జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న రైల్యే అధికారులు తక్షణమే స్పందించి రైలును అంబోదల స్టేషన్‌లో నిలిపివేశారు. స్టేషన్ మాస్టర్ వెంటనే అంబులెన్స్, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేవరకు అంబొదలకు చెందిన సామాజిక కార్యకర్త ముకుంద త్రిపాఠి సహకారంతో స్థానిక వైద్య సిబ్బంది నుంచి ఒక నర్సును రప్పించారు. నర్సు రైలులోనే తల్లీబిడ్డకు ప్రాథమిక వైద్యసాయం అందించారు. రైల్వే పాయింట్స్ మెన్ గౌరంగ గంగా, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం అంబులెన్స్‌లో తల్లీబిడ్డను అంబొదల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది, వైద్య సిబ్బంది, ప్రయాణికులు సమయస్ఫూర్తితో స్పందించి సహాయం అందించడం పలువురి ప్రసంశలు అందుకుంది.


