రాయగడ: గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, భూముల యజమాన్య హక్కులను సృష్టికరించేందుకు అమలు చేస్తున్న స్వమిత్వ పథకం రాయగడ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని 11 తహసీల్‌ల పరిధిలో మొత్తం 2,654 గ్రామాలకు గాను.. 2,401 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. ఇప్పటివరకు 161 గ్రామాలకు చెందిన 4,276 మంది అర్హులైన లబ్ధిదారులకు ఆస్తి కార్డులు అందజేశారు. అయితే మరో 253 గ్రామాల్లో ఇంకా సర్వే పూర్తి కావాల్సి ఉంది. 2020 ఏప్రిల్ 24న ప్రారంభమైన స్వమిత్వా పథకంలో గ్రామీణ ఆవాస ప్రాంతాల్లోని భూములు, ఇళ్లను డ్రోన్ల ద్వారా సర్వే చేసి యజమాన్య హక్కులకు సంబంధించిన రికార్డులను రూపొందిస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. డ్రోన్ సర్వే అనంతరం డేటా తయారీ, మ్యాప్‌ల రూపకల్పన, క్షేత్రస్తాయి పరిశీలన, డ్రాప్ట్ మ్యాప్ ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, తుది రికార్డుల ఆమోదం వంటి దశలు పూర్తయిన తర్వాత ఆస్తి కార్డులు పంపిణీ చేస్తున్నారు.
రాయగడ జిల్లాలో...
రాయగడ జిల్లాలోని తహసీల్‌ల వారీగా పరిశీలిస్తే.. రాయగడ తహసీల్ పరిధిలో 300 గ్రామాలకు గాను 275 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా.. 17 గ్రామాలకు చెందిన 809 మందికి కార్డులు అందాయి. కొలనారలో 192 గ్రామాల్లో సర్వే పూర్తయ్యి 8 గ్రామాలకు చెందిన 346 మందికి, కల్యాణసింగుపూర్‌లో 230 గ్రామాల్లో సర్వే పూర్తయి 17 గ్రామాలకు చెందిన 239 మందికి కార్డులు ఇచ్చారు. అదేవిధంగా కాసీపూర్‌లోని 364 గ్రామాల్లో సర్వే పూర్తికాగా.. 26 గ్రామాలకు చెందిన 474 మందికి, మునిగుడలోని 347 గ్రామాల్లో సర్వే పూర్తికాగా 12 గ్రామాలకు చెందిన 249 మందికి, గుడారిలో 154 గ్రామాల్లో సర్వే పూర్తయి 30 గ్రామాలకు చెందిన 891 మందికి ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. రామనగుడలోని 114 గ్రామాల్లో సర్వే పూర్తయ్యి 5 గ్రామాలకు చెందిన 248 మందికి, పద్మపూర్‌లోని 123 గ్రామాల్లో సర్వే పూర్తయ్యి 17 గ్రామాలకు చెందిన 90 మందికి కార్డుల పంపిణీ చేశారు. అదేవిధంగా బిసంకటక్‌లోని 287 గ్రామాల్లో సర్వే పూర్తయ్యి 11 గ్రామాలకు చెందిన 100 మందికి, గుణుపూర్‌లోని 127 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 8 గ్రామాలకు చెందిన 548 మందికి, చంద్రపూర్‌లోని 188 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి 10 గ్రామాలకు చెందిన 282 మందికి ఆస్తి కార్డులు అందించారు.
253 గ్రామాల్లో సాగని సర్వే
అయితే ఇంకో 253 గ్రామాల విషయంలో పలు కారణాలతో సర్వే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వీటిలో 171 గ్రామాలు జనవాసాలు లేనివిగా ఉండగా.. మరో 20 గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో విలీనమయ్యయి. అలాగే చంద్రపూర్ తహసీల్‌లోని 20 గ్రామాలు అటవీ భూముల పరిధిలో ఉండగా, కాసీపూర్‌లోని 18 గ్రామాలు గనుల ప్రాంతాలకు సంబంధించిన కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. కాసీపూర్‌లో 12, కల్యాణ సింగుపూర్‌లోని 2 గ్రామాల్లో స్థానిక వివాదాలు, అసహకారం, వ్యతిరేకత కారణంగా సర్వే జరగలేదు. మునిగుడలోని మరో 7 గ్రామాల్లో డ్రోన్ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవాసాలు లేని, పట్టణ ప్రాంతాల్లో విలీనమైన గ్రామాల విషయంలో పరిపాలనా స్పష్టత తీసుకురావడంతో పాటు అటవీ, గనుల ప్రాంతాలకు సంబంధించిన చట్టపరమైన, శాఖపరమైన అడ్డంకులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా వ్యతిరేకత లేదా అసహకారం ఉన్న ప్రాంతాల్లో గ్రామస్తులతో చర్చించి స్వమిత్వా పథకం ఉద్దేశం, ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.
రాయగడ జిల్లాలో 2,401 గ్రామాల్లో పూర్తి
4,276 మందికి అస్తికార్డులు
పంపిణీ
పలు గ్రామాల్లో ఇంకా సర్వే చేపట్టని వైనం


