● దిశా సమీక్ష సమావేశంలో
ఎంపీ సప్తగిరి ఉలక
రాయగడ: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా స్థాయి దిశా సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక అధ్యక్షతన దిశా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కేంద్ర పథకాల అమలు తీరు, మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్యా, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, ఉపాధి తదితర అంశాలపై చర్చించారు. సమావేశలో రా యగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ (గుణుపూర్) దుదూల్ అభిషేక్ దిలీప్, సబ్ కలెక్టర్ (రాయగడ) మృణాళికా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ సమస్యలపై చర్చ
సమావేశంలో భాగంగా 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బిసంకటక్, గుణుపూర్, రాయగడ ప్రాంతాల్లో ఎంపీ ల్యాడ్ నిధులతో మంజూరైన తరగతి గదుల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. అలాగే ఖరీఫ్ 2026 ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై కూడా సమీక్ష జరిగింది. జిల్లాలో మొత్తం 49,966 మంది రైతులు పంటల బీమా పథకంలో చేరినట్లు అధికారులు తెలిపారు. ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్, కామధేను పథకాల అమలును సమీక్షిస్తూ వాటిపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పట్టణ ప్రాంతాల సమీపంలో సంచరిస్తున్న పశువుల కోసం గోశాలల నిర్మాణంపై కూడా చర్చించారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై సమీక్షలో జిల్లాలో 16,417 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,036 మంది టీబీ బాధితులను గుర్తించినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో చికిత్స విజయవంతమైన రేటు 89 శాతంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో కామెర్ల సమస్య, కొలనార సమితిలోని రొబాడి ప్రాంతంలో విద్యార్థులు కామెర్ల బారినపడిన ఘటనపై కూడా చర్చించారు. అలాగే వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.


