శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు ఈ నెల 20న జరగనున్నాయని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు గురువారం పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ సెలక్షన్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. బాలబాలికలు 2009 జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్ వద్దకు చేరుకోవాలని, పూర్తి వివరాలకు పీడీ మెట్ట తిరుపతిరావు (94404 36317)ను సంప్రదించాలని కోరారు.
రేపు ఛాయారాజ్ వర్ధంతి సభ
శ్రీకాకుళం: ప్రజాసాహిత్య, సాంస్కృతికోద్యమ నేత, భావాల సరిహద్దుల వద్ద కాపలా కాసిన నూతన ప్రజాస్వామిక కవి కామ్రేడ్ ఛాయారాజ్ 13వ వర్ధంతి సభ ఈ నెల 20న శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు జనసాహితి జిల్లా అధ్యక్షుడు టి.శోభన్ బాబు, ఉపాధ్యక్షుడు కె.పాపారావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా సదస్సు, కవి సమ్మేళనం జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరారు.
ఆకట్టుకున్న నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్ : సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో అఖిల భారత బహుభాషా నాటిక పోటీలు రెండో రోజు శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ఉత్సాహంగా సాగాయి. ముంబైకు చెందిన బియింగ్ కళాకార్ రచన, యువరాజ్ వివేక్తమహంకర్ దర్శకత్వంలో ‘సూప్’ అనే మరాఠీ నాటిక ప్రదర్శించారు. అనంతరం వీకేఎం కళావిదురు, బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కంబార్ రచనలో, సీఎం తిమ్మయ్య దర్శకత్వంలో ‘సాంగ్వా –బాల్య’ కన్నడ నాటిక ఆద్యంతం అలరించింది. అనంతరం కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇప్పిలి శంకరశర్మ, కె.సోమేశ్వరరావు, విశ్రాంత రిజిస్ట్రార్ గుంట తులసిరావు, ప్రిన్సిపాల్ నంద సూర్యనారాయణ స్వామి, ఎల్.నందికేశ్వరరావు, కొంక్యాన మురళి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
‘పనుల్లో జాప్యం సహించబోను’
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనుల నిర్వహణను వేగవంతం చేయడంతో పాటు ఆన్‌లైన్ అప్‌లోడింగ్, బిల్లుల చెల్లింపుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీరాజ్, రహదారులు భవనాలు, నీటిపారుదల, ట్రైబ ల్ ఇంజినీరింగ్ సహా వివిధ శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనుల పురోగతిపై అసిస్టెంట్ ఇంజినీర్ల వారీగా కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో మంజూరైన పనులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తయిన వెంటనే బిల్లుల కు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. కొత్తూరు, హిరమండలం, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, గార, శ్రీకాకుళం, రణస్థలం, లావే రు, బూర్జ సహా జిల్లాలోని అన్ని మండలాల సహాయ ఇంజనీర్లు తమ తమ పరిధిలోని పనులను యుద్ధప్రాతిపదికన పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు.
రూ.లక్ష పలికిన లడ్డూ
వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దానం రామకృష్ణాపురం(బొడ్డువానితోటలు)లో వినియక చవితి లడ్డూ ఏకంగా రూ.లక్ష పలికింది. శుక్రవారం వినాయకుని నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించగా సైనూరు గ్రామానికి చెందిన చింత బాలకృష్ణ ఒక్కసారిగా రూ.లక్షకు లడ్డూను దక్కించుకున్నారు.


