కొరాపుట్: ప్రజా సమస్యలపై అధికారులకు స్పందన లేదని డిస్ట్రిక్ డెవపల్‌మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రం లోని డీఎన్‌కే సమావేశ మందిరంలో దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ కొరాపుట్ జిల్లాలో పశు సంపద పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నాలు విఫలం అయ్యాయన్నారు. ఆంధ్ర నుంచి పశువులు తెచ్చి ఇక్కడ గిరిజనులకు సబ్సిడీ మీద గత కొన్నేళ్లుగా ఇస్తున్నారన్నారు. కానీ అంత కంటే బలమైన పశువులు సిమిలిగుడ లో లభిస్తుంటే వాటిని అనుమతించడం లేదన్నారు. ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ పూర్తి అవినీతి మయంగా మారిందన్నారు. బందుగుడ గ్రామం లో రోడ్డు కావాలని ఒక బాలిక చేసిన ఉద్యమం నీరు గారిందన్నారు. రోడ్డు నిర్మాణం లో 35 శాతం దళారులు ఆర్జిస్తున్నారని తెలిపారు.
ఆర్‌డీ విభాగం చేస్తున్న అవినీతి అంతులేకుండా పోయిందన్నారు. టెండర్ ఫిక్స్ అవుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. సమావేశంలో సీఎల్పీ నాయకుడు రామ చంద్ర ఖడం, కలెక్టర్ సత్యవాన్ మహాజన్,ఎంపీలు సప్తగిరి ఉల్క (కొరాపుట్), బలబద్ర మజ్జి (నబరంగ్‌పూర్), ఎమ్మెల్యేలు పవిత్ర శాంత(లక్ష్మీపూర్), రుపుదర్ బోత్ర (కొట్‌పాడ్),జెడ్పీ ప్రెసిడెంట్ సస్మిత మెలక, తదితరులు పాల్గొన్నారు.


