జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్‌లో సీనియర్ దివానీ (సివిల్) కోర్టు ఏర్పాటు చేయాలని కొట్‌పాడ్ బార్ అసోసియేషన్ గురువారం కొరింది. కొట్‌పాడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మణి ప్రసాద్ పట్నాయక్ నేతృత్వంలో పలువురు న్యాయవాదులు కటక్ ఉన్నత న్యాయాలయానికి వెళ్లారు. కొరాపుట్ జిల్లా పోర్టు పోలియో విచారతి కటక్ ఉన్నత న్యాయాధికారి చిత్తరంజన్ దాస్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. కొట్‌పాడ్‌లో సీనియర్ సివిల్ కోర్టు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కొట్‌పాడ్‌లో అనేక మంది సివిల్ కేసులకు జయపురం సివిల్ కోర్టుపై ఆధారపడుతున్నారని, ప్రతి దినం అనేక సివిల్ కేసులు కొట్‌పాడ్, తదితర సమితుల నుంచి జయపురం వెళ్తున్నాయని ఇప్పటికే వందలాది కేసులు జయపురంలో పెండింగ్‌లో ఉన్నాయని వినతిపత్రంలో వెల్లడించారు. కొట్‌పాడ్‌లో శాశ్వత సివిల్ కోర్టు ఏర్పాటు చేస్తే కొట్‌పాడ్ సమితితోపాటు కుంధ్ర, బొయిపరిగుడ, బొరిగుమ్మ సమితుల ప్రజలు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. కటక్ ఉన్నత న్యాయాలయ జడ్జి చిత్తరంజన్ దాస్‌ను కలసిన వారిలో బార్ అసోసియేషన్ మణిప్రసాద్ పట్నాయక్, కార్యదర్శి అనిల్ కుమార్ పట్నాయక్, మాజీ అధ్యక్షుడు కిశోర్ మహాపాత్రో, మాజీ కార్యదర్శి కిశోర్ చంద్ర మిశ్ర, బిరేష్ బిశాయి, శంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని నెలల్లో కొట్‌పాడ్‌లో సివిల్ కోర్టు ఏర్పాటు చేస్తామని న్యాయమూర్తి హామీ ఇచ్చారని మణిప్రసాద్ పట్నాయక్ తెలిపారు.


