● గుణుపూర్‌లో అత్యధికంగా 398 ఎన్‌డీపీఎస్ కేసులు..
రాయగడ: గంజాయి, తదితర మాదకద్రవ్యాల కేసుల విచారణ కోసం గుణుపూర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్నా ప్రక్రియ మాత్ర నెమ్మదిగా సాగుతోంది. గుణుపూర్ ప్రాంతంలోనే అత్యధికంగా 398 ఎన్‌డీపీఎస్ కేసులు విచారణలో ఉండటంతో ప్రత్యేక కోర్టు అవసరం ఉంది. ఈ మేరకు గుణుపూర్ బార్ అసోసియేషన్ పలుమార్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం గుణుపూర్ ఏడీజే కోర్టు పరిధిలో గుణుపూర్, పద్మపూర్, గుడారి, రామనగుడ సమితులు, తహసీల్ ప్రాతాలకు సంబంధించిన కేసుల విచారణ జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో నమోదవుతున్న గంజాయి సహా అన్ని ఎన్‌డీపీఎస్ కేసులు గుణుపూర్ ఏడీజే కోర్టులోనే విచారణకు వస్తున్నాయి. జిల్లాలో మూడు ఏడీజే కోర్టుల్లో గుణుపూర్‌లోనే అత్యధికంగా 398 కేసులు విచారణలో ఉన్నాయి. బిసంకటక్ ఏడీజే కొర్టులో 209 కేసులు, రాయగడ ఏడీజే కోర్టులో 118 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2025–26 సంవత్సరానికి సంబంధించి గుణుపూర్ కోర్టులొ 104 ఎన్‌డీపీఎస్ కేసులు, బింసకటకలో 40, రాయగడలో 34 కేసులు ఉన్నాయి.
19 జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం..
ఎన్‌డీపీఎస్ కేసులను వేగంగా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో గుణుపూర్‌లోనూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు. గుణుపూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గౌరిశంకర్ దాస్, సీనియర్ న్యాయవాదులు ఉమాచరణ్ పట్నాయక్, ఎస్.గణపతి రావు, తదితరులు గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై వినతిపత్రం సమర్పించారు. గుణుపూర్‌లో ప్రత్యేక గంజాయి కేసుల విచారణకు కోర్టు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి చెందిన కక్షిదారులు, న్యాయవాదులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని బార్ అసోసియేషన్ పేర్కొంటుంది. కేసుల భారాన్ని తగ్గించడంతోపాటు విచారణను వేగవంతం చేయడానికి కూడా ఇది దొహదపడుతుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
రోడ్డుపై కూలిన విద్యుత్ స్తంభం
● అంధకారంలో పలు గ్రామాలు
జయపురం: వర్షాలు కురవడంతో జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్థంభాలు నేల కూలాయి. పలు గ్రామాలకు రాకపోకలకు అవరోధం ఏర్పడటమే కాకుండా అనేక గ్రాలు అంధకారమయ్యాయి. కొలార్ పంచాయతీ నువాగుడ రహదారిపై విద్యుత్ స్తంభం పడింది. నువాగుడలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాలు అంధకారమయ్యాయి. ఆదివారం బొయిపరిగుడ సమితిలో 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేని వర్షాలు కారణంతో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు, గ్రామాల మధ్య రహదారి సంబంధాలు నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంత గ్రామాల ప్రజలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సమాచారం అందడంతో విద్యుత్ విభాగ సిబ్బంది చేరుకొని రోడ్డుపై పడిన విద్యుత్ స్తంభాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి కొత్త స్తంభాలు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


