రాయగడ: ఏళ్ల తరబడి రహదారులు, రవాణా సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యానికి గురవుతున్న గుడారి ప్రాంత ప్రజలు ఆందోళన బాట పట్టారు. వంశధార వంతెనకు అనుసంధానించే రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టడంతోపాటు మొత్తం అయిదు ప్రధాన డిమాండ్లను పరిష్కారం కోరుతూ సెప్టెంబరు 22న గుడారి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ కూడా మద్దతు ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా బీడీఓ అందుబాటులో లేకపోవడంతో జిపిఎస్‌డిఒ శివప్రసాద్ పండ ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఆందోళనకారులు వినతిపత్రం సమర్పించారు. గుడారి ప్రాంత యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలు సంఘాలకు చెందిన ప్రతనిధులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి సెప్టెంబరు 21లోగా స్పష్టమైన హామీ రాకపోతే పట్టణ ప్రజల పూర్తి సహాకారంతో 22న బంద్ నిర్వహిస్తామని కేదార్ సాహు, ఎం.ప్రసాద్ తెలిపారు.
మూడేళ్లుగా ఆధ్వానంగా రహదారి..
గుడారి పట్టణానికి ప్రధాన అనుసంధాన మార్గంగా, వంశధార వంతెనకు వెళ్లే రహదారి సుమారు మూడేళ్లగా అధ్వానంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి గుంతలమయంగా మరడంతోపాటు ప్రయాణం ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం నిర్వహించిన పలు ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాల్లో ఈ సమస్యలను జిల్లా అధికారుల దృష్టకి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
గుడారి సమస్యపై ఎమ్మెల్యే మద్దతు..
గుడారి ప్రాంత సమస్యలపై ప్రభుత్వం, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ అన్నారు. ఈ అంశాన్ని సెప్టెంబరు 17న జరగనున్న రివ్యూ మీటింగ్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకారులు చేపట్టే బంద్‌కు తన పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.


