రాయగడ: మేనల్లుడి హత్య కేసులో నిందితుడైన మేనమామకు గుణుపూర్ ఏడీజే కోర్టు జీవిత ఖైదు విధించింది. నేరం రుజువు కావడంతో ఎస్.బుడ్డుకి జీవిత ఖైదుతో పాటు రూ.పది వేల జరిమానా చెల్లించాలని న్యాయ మూర్తి దేవదత్త పట్నాయక్ సోమవారం తీర్పునిచ్చారు. జిల్లాలోని గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధి సిర్జులి గ్రామంలో 2023 జూలై 21 వ తేదీ రాత్రి ఎస్.బుడ్డు, అతని మేనల్లుడు ఎస్.రమేష్ మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిలో నిద్రిస్తున్న రమేష్‌పై బుడ్డు కత్తితో దాడి చేసినట్లు కేసు నమోదైంది. తీవ్రగాయాలతో రమేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై సిర్జులి గ్రామ వార్డు సభ్యుడు బొషి బిజు జూలై 22 న గుణుపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బుడ్డును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసు గుణుపూర్ ఏడీజే కోర్టులో విచారణకు రాగా, మొత్తం 12 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.
ఘనంగా నందోత్సవాలు
జయపురం: శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత వచ్చే నందోత్సవాన్ని జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బొరిగుమ్మలో పురాతన వైష్ణవ సంప్రదాయ కుటుంబాల వారు సంప్రదాయంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
చెరువులో మునిగి చిన్నారి మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి టెమురుపల్లి పంచాయతీ సర్గిగుఢ గ్రామంలో సోమవారం రెండేళ్ల చిన్నారి ఆడుతూ చెరువులో మునిగి మృతి చెందింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త బాలమతి పూజారి తన రెండేళ్ల కూతురిని ఇంటి వద్ద వదిలి పొలానికి వెళ్లారు. పాప ఆడుతూ సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లిపోయింది. ఎవరూ చూడకపోవడంతో నీటిలో మునిగిపోయింది. పాప కనిపించకపోవడంతో అంతా వెతికారు. కాసేపటి తర్వాత నీటిలో తేలుతూ కనిపించింది. వెంటనే దిగి బయటకు తీయగా పాప చనిపోయి ఉంది. ఆఖరి ప్రయత్నంగా వెంటనే మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించినా లాభం లేకపోయింది. అక్కడి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐఐసీ దీపాంజలి ఆరోగ్య కేంద్రానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు.
భువనేశ్వర్‌లో కుప్పకూలిన భవనం
భువనేశ్వర్: దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ఏడుగురి ప్రాణాలు బలిగొన్న భవనం కూలిన ఘటన నుంచి కోలుకోక ముందే.. రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్‌లో ఇలాంటి భయానక సంఘటన చోటు చేసుకుంది. స్థానిక డెల్టా స్క్వేర్ ప్రాంతంలో భవన నిర్మాణం కోసం అమర్చిన ఇనుప చట్రం నిట్ట నిలువునా కుప్ప కూలిపోయింది. ఇరుగు పొరుగు వారి కథనం ప్రకారం ఆదివారం రాత్రి పూట అకస్మాత్తుగా భూకంపం లాంటి భారీ శబ్దం విని వారు బెంబేలెత్తారు. అసలు ఏం జరిగిందో వారికి ఏమాత్రం అంతుబట్టలేదు. నిర్మాణ స్థలం నుంచి రేగిన దుమ్మును గమనించిన తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం ఇనుప చట్రం కూలిపోయిందని వారు గ్రహించారు. ఇది ఎలా కూలిపోయింది, సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన ఏ ప్రాజెక్టులో జరిగింది, ఏ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతోంది, నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు పొందారా లేదా అనే విషయాలు కూడా ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.


