పర్యావరణ పరిరక్షణపై ..
రాయగడ:
స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పర్యావరణం కోసం ప్రతీఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నిహిరి రంజన్ కుహరో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం సందర్భంగా రాయగడ పట్టణంలో పర్యావరణ అవగాహన ర్యాలీతోపాటు ప్లాస్టిక్ వ్యర్ధాల శుభ్రతా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. స్ధానిక గుండిచా మందిరం నుంచి మజ్జిగౌరి అమ్మవారి మందిరం వరకు నిర్వహించిన ర్యాలీని కుహరో జెండా ఊపి ప్రారంభించగా.. విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నివారణ, మొక్కలు నాటడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో అదనపు కలెక్టర్ కుహరో మాట్లాడుతూ.. వాయు కాలుష్యాన్ని నిరంతరం తగ్గించేందుకు సామూహిక కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల
వాతావరణంలో విషపూరిత పదార్ధాలు కలిసే ప్రమాదం ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ కాల్చవద్దని ప్రజలకు సూచించారు. అనంతరం మజ్జిగౌరి అమ్మవారి మందిరానికి చేరుకుని పరిసరాలను శుభ్రపరిచారు. ర్యాలీలో మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ, బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి అశోక్ కుమార్ భొయ్ తదితరులు పాల్గొన్నారు.


