స్వయం సహాయక సంఘాల మహిళల వినతి
రాయగడ: ప్రజల జీవనోపాధికి, చిన్న వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడేలా కంధకిలుము కూడలిలో ప్రతిపాదిత మార్కెట్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, స్వయం సహాయక సంఘాల మహిళలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు. సదరు సమితి పరిధిలోని పితామహాల్ పంచాయతీలోని కంధకిలుము గ్రామంలో సుమారు 450 కుటుంబాలకుపైగా నివసిస్తున్నారు. గ్రామంలో నాలుగు నుంచి ఐదు స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. వాటిలో మహిళలు చిన్న వ్యాపారాలు, వివిధ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా కటుంబాలను పోషిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కంధకిలుము కూడలి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతమని అందువల్ల అక్కడ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయగలిగినే చిరు వ్యాపారులకు ఎంతో మేలవుతుందని పేర్కొన్నారు. అయితే ప్రతిపాదిత స్థలాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో బీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అధ్యయనం చేసి ప్రతిపాదిత స్థలాన్ని మార్చకుండా కంధకిలుము కూడలి వద్దే మార్కెట్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు


