రాయగడ: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో ర్యాగింగ్ ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటం కలకలం రేపుతోంది. జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల రివల్‌కోన ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన మరువక ముందే సదరు సమితి పరిధిలోని పెంటా ఉన్నత పాఠశాలలోనూ జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనకు సంబంఽధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వైరల్ వీడియోలో ఓ వ్యక్తి మాట్లాడుతూ పెంటా ఉన్నత పాఠశాలలో జూనియర్ విద్యార్థులను పదో తరగతి సీనియర్ విద్యార్థులు కొందరు వేధిస్తున్నారని ఆరోపించారు. ఓ జూనియర్ విద్యార్థి కన్నీటి పర్యంతమవుతూ సీనియర్లు తమను కొట్టడంతో పాటు బట్టలు ఉతికించడం, అసభ్యకరంగా ప్రవర్తించేలా వేధిస్తున్నారని చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారు అనే విషయాలపై స్పష్టత లేదు. దీనిపై అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది. ఇటీవల రివల్‌కోన ఉన్నత పాఠశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ చేపట్టింది. ఆ ఘటనలో పాఠశల యజమాన్యం ఏడుగురు విద్యార్థులను పాఠశాల నుంచి టీసీలు ఇచ్చి బహిష్కరించింది. అనంతరం వారిపై చందిలి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. జిల్లాలోని ఆవాసిక ఆశ్రమ పాఠశాలల్లో పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజాగా పెంటా పాఠశాలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆవాసిక పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయం పై న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అనూప్ కుమార్ పాత్రో ఎన్‌సీపీసీఆర్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆదేశాలతో సమితి సంక్షేమ శాఖ అధికారి, సిబ్బంది పెంటా రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల అధికారులు వివిధ అంశాలపై విచారిస్తున్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తరుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.


