యువకుని అరెస్టు
రాయగడ: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 4.280 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి తమిళనాడుకు చెందిన తిరువారంగమ్ పరిధిలోని భిలూపురం గ్రామానికి చెందిన బాలగురు ఎయుహుమాలయ్‌గా గుర్తించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం..ఓ యువకుడు స్థానిక రైల్వేస్టేషన్‌లో హవుడా –బెంగళూరు ఎస్‌ఎంవీటి రైలులో విశాఖ వెళ్లేందుకు సోమవారం నిరీక్షిస్తున్నాడు. జీఆర్పీ సిబ్బంది ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో ఎప్పటిలాగే తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా యువకుడు కనిపించడంతో అతనిి బ్యాగును పరిశీలించగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
కోరుకొండ సమితిలో పది కిలోలు..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల పోలీసులు సోమవారం మధ్యాహ్నం సుర్లుకొండ వంతెన సమీపం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్కూటీపై వస్తున్నారు. అనుమానంతో వారిని అపి తనిఖీ చేయగా వారివద్ద ఓ బస్తా కనిపించింది. దాని పరిశీలించగా గంజాయి ఉండడంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా పది కిలోలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. దీనివిలువ సుమారు 70 వేల రూపాయల వరకూ ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడిన నిందితులు కలిమెల సమితి కేందుగూఢ గ్రామానికి చెందిన కులధర్ నాయక్, టెక్‌గూఢకు చెందిన డంబురు మఠం, శుకుదేవ్ మాఝిలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 20 వేలు నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై అజిత్‌సింగ్ తెలిపారు. వీరిని విచారించిన తరువాత కోర్టులో హాజరుపరుస్తామన్నారు.


