సమస్యలు తెలుసుకుంటూ హామీలిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తెలుసుకుంటూ హామీలిస్తూ..

Sep 7 2026 7:51 AM | Updated on Sep 7 2026 7:51 AM

గ్రామాల్లో గుణుపూర్‌ ఎమ్మెల్యే

సత్యజీత్‌ గొమాంగో పర్యటన

రాయగడ: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో గుణుపూర్‌ ఎమ్మెల్యే సత్యజీత్‌ గొమాంగో రామనగుడ సమితిలోని పలు మారుమూల గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. సుండిధాముని పంచాయతీ పరిధిలోని బాటపులిసి, కానిపులిసి, చెకాగుడ, బడపులిసి, దురుగుడా, బిరిబాయి, రుగుడుబాయి తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన ఆయా గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వితంతువులు పింఛన్లకు దూరంగా ఉన్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గతంతో క్రమం తప్పకుండా పింఛన్లు పొందుతున్న కొందరికి కొన్ని నెలలుగా అందడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వ గృహ పథకం కింద ఇళ్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నట్టు ఎమ్మెల్యే గొమాంగో గుర్తించారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు ఉందని తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన మౌలిక సౌకర్యాల మెరుగుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యవర్గం సభ్యుడు రమాకాంత మా ఝి, సీనియర్‌ నాయకుడు నీలమాధవ సాహు, ఎంపీ ప్రతినిధి ప్రసాద్‌రావు, రంజిత్‌ నాయక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement