● స్థానికుల్లో భయాందోళనలు
భువనేశ్వర్: కటక్ జిల్లా నియాళి మండలం పరిధిలోని కరంగ గ్రామంలో ప్రధాన గ్రామీణ రహదారి అకస్మాత్తుగా కూరుకుపోయింది. దాదాపు 300 మీటర్ల పొడవునా రహదారి 10 అడుగుల లోతుకు కూరుకుపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల ఏర్పడుతున్న పగుళ్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రహదారిపై కరంగ, చుట్టుపక్కల మూడు గ్రామాలకు చెందిన ప్రజలు రాకపోకల కోసం ఆధారపడి ఉన్నారు. ఆయా గ్రామాలకు ఇదే ముఖ్యమైన అనుసంధాన మార్గం కావడంతో నిత్యం రాకపోకలు చేయడం పట్ల గ్రామీణులు బిక్కు బిక్కుమంటున్నారు. రహదారి పక్కన ఉన్న ఇళ్లు కూడా ప్రభావితం కావచ్చని గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలతో తౌలా నదిలో నీటిమట్టం పెరుగుదల కారణంగా క్రమంగా మట్టి కోతకు గురై రోడ్డు కుంగిపోయింది. ప్రస్తుతం రోడ్డులో 300 మీటర్లకు పైగా కుంగిపోయింది. తక్షణమే చర్యలు చేపట్టకుంటే నది నీరు కోతతో రహదారి మరింత కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈ రహదారి పరిసర ప్రాంతాల్లో నిర్మితం అయిన ఇండ్ల గోడలు మరియు నేలపై పగుళ్లు ఏర్పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది.


