మైనింగ్‌ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

Aug 16 2026 6:21 AM | Updated on Aug 16 2026 6:21 AM

భువనేశ్వర్‌: గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు–2026ను వ్యతిరేకించాలని, ఈ బిల్లుతో రాష్ట్ర ఆర్థిక స్వయంప్రతిపత్తికి, ఖనిజ వనరులపై రాజ్యాంగ హక్కులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ప్రతిపక్ష నాయకుడు, బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం, ఒడిశా శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్య మంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీకి లేఖరాశారు. పార్లమెంటు ఇటీవల ఆమోదించిన బిల్లుతో ఖనిజ హక్కులు, ఖనిజ లవణాలున్న భూములపై పన్నులు, సెస్సులు విధించే ఒడిశా వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాల అధికారాలను పరిమితం చేసి విపరీత ప్రభావం చూపుతుందన్నారు. ఈ బిల్లును రాష్ట్ర ఆర్థిక హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ క్రమంలో రాజ్య సభలో బిజూ జనతా దళ్‌ (బీజేడీ) ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారని వివరించారు. కొత్త చట్టంలోని నిబంధనలు ఖనిజ నిక్షేపాలున్న భూములపై కేంద్ర నియంత్రణను విస్తరిస్తాయని తెలిపారు. కేంద్రం విధించిన షరతులకు లోబడి తప్ప, ఖనిజ హక్కులు లేదా ఖనిజ నిక్షేపాలున్న భూములపై ఎలాంటి పన్ను, సెస్‌ లేదా అలాంటి ఇతర సుంకాలను విధించకుండా రాష్ట్ర ప్రభుత్వాలను పరిమితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖనిజ పదార్థాలపై పన్ను విధింపునకు సంబంధించి రాష్ట్రాల అధికారాలను పరిమితం చేసే నిబంధనలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి మరింత అధికారం కల్పించే సెక్షన్‌ 13 సవరణలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఒడిశా సహజ సంపద నిస్సందేహంగా అక్కడి ప్రజలకే చెందుతుందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి మైనింగ్‌ కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం కీలకమని నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. ఖనిజ సంపద ఉన్న భూములపై పన్నులు, సెస్సులు విధించే రాష్ట్ర అధికారాన్ని తొలగించడం సమాఖ్యవాదాన్ని, ఒడిశా రెవెన్యూ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఖనిజ నిక్షేపాలున్న భూములపై రాష్ట్రానికి ఉన్న అధికారాన్ని, సెస్సులు విధించే హక్కును కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే, ఒడిశాలో కాలుష్యం, ప్రజల స్థానభ్రంశం, మైనింగ్‌ భారం మాత్రమే మిగిలిపోతాయన్నారు. రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలు చేజారిపోతాయన్నారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర సమాఖ్య హక్కులు, ఖనిజ ఆదాయాలను పరిరక్షించడంపై ఏకీకృత ఏకాభిప్రాయం సాధించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్ష నేత నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించేందుకు శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఒడిశా ప్రజల సర్వోన్నత ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బీజేడీ అధ్యక్షుడు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement