రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

రక్తదాన శిబిరం

Aug 16 2026 6:21 AM | Updated on Aug 16 2026 6:21 AM

గార: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని కె.మత్స్యలేశం బుద్ధా పాఠశాలలో రక్తదాన శిబిరం శనివారం నిర్వహించారు. శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బందితో పాటు స్థానిక యువత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ బి.లలిత మాట్లాడుతూ రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ కరస్పాండెంట్‌ బి.ఎర్రన్న, బత్తుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రం ఆవిష్కరణ

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని మొండేటివీధిలో వేంచేసిన శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో జరగనున్న వినాయక చవితి వేడుకల కరపత్రం శనివారం ఆవిష్కరించారు. షిర్డీసాయి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పత్రిక ఆవిష్కరణ జరిగింది.

గాంధీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నగరంలోని జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నూతన ప్రాంగణంలో ఏడు అడుగుల గాంధీజీ విగ్రహం నిర్మాణానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శనివారం శంకుస్థాపన చేశారు. రూ.12 లక్షల వ్యయంతో 5 అడుగుల పీఠంపై 7 అడుగుల ఎత్తుగల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండియా, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నగదు పురస్కారాలు అందజేత

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధి సింగుపురం గ్రామంలోని క్రాంతి విద్యానికేతన్‌ స్కూల్లో కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ గుండ అమ్మడు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–26లో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులు పి.హేమంత్‌, ఎ.కార్తీక్‌లకు ఎంఈవో రెడ్డి సీతంనాయుడు చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్‌ యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతిభా పురస్కారం అందజేత

శ్రీకాకుళం (పిఎన్‌కాలనీ): శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఆఫీస్‌ సబార్డినేటర్‌గా పనిచేస్తున్న రాకోటి జనార్దన్‌రావు 80వ స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా ప్రతిభ పురస్కారాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ చేతులమీదుగా శనివారం అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాపై నిర్లక్ష్యం వద్దు

జి.సిగడాం: ఓటర్ల జాబితాలో తప్పులుంటే సవరణ చేసుకోవాలని, ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మహాదేవు సరిత సూచించారు. మండలంలోని పెంట, నాగువలస పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆమె సందర్శించారు. కార్యక్రమంలో బూత్‌ లెవల్‌ అధికారి భూపతి నర్సింగరావు, దుర్గారావు, కురిటి సాయి పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో జలయాత్ర

ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ పరిధి తొమ్మిదో వార్డుకి చెందిన మహిళలు శనివారం భక్తిశ్రద్ధలతో జలయాత్ర చేపట్టారు. ముడియా వీధిలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకొని బాహుదానది నుంచి కళశాలతో జలాలను తీసుకొచ్చారు. ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement