సారవకోట: మండలంలోని అలుదు గ్రామానికి చెందిన చెట్టు రామారావు కుటుంబ సభ్యులు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ రికార్డులు తారుమారు చేశారని మంగళవారం నిరసన తెలియజేశారు. తమకున్న సర్వే నంబర్ 413–3, 395–16, 394–12లో 98 సెంట్లు ఉండేదని, ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్–బీ ఆన్‌లైన్‌లో తీస్తే అలాగే వచ్చిందని తెలిపారు. అయితే ఇటీవల మరోసారి తీసిన వన్–బీలో 344–10లో 22 సెంట్లు భూమి తమకున్నట్లు అదనంగా నమోదు చేశారన్నారు. తమది కానీ భూమిని తమ రికార్డులో నమోదు చేయడంతో తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రవికి ఫిర్యాదు చేసినా ఫిర్యాదు తీసుకోలేదన్నారు. దీంతో ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదునే మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం 22 సెంట్లు అదనంగా నమోదు కావడంతో డిజిటల్ సంతకం కావడం లేదని, దీనివలన తమ భూమిని అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితులు బాగులేక వైద్య ఖర్చుల నిమిత్తం అమ్ముకునేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని, సంబంధిత అధికారులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దీనిపై డిప్యూటీ తహసీల్దార్ రవిని వివరణ కోరగా.. 22 సెంట్లుకు సంబంధించి చెట్టు రామారావు ఒక స్టేట్‌మెంట్ ఇస్తే, దాని ఆధారంగా ఆర్డీవో లాగిన్‌లో సమస్యను పరిష్కరిస్తామన్నారు.


