శ్రీకాకుళం క్రైమ్ : ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫొటో కాంటెస్ట్–2026 అవార్డుల్లో శ్రీకాకుళం ‘సాక్షి’ సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కుప్పిలి జయశంకర్‌కు జనరల్ న్యూస్ విభాగంలో కన్సొలేషన్ అవార్డు దక్కింది. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణం దరిలో ఉన్న పొన్నాడ గ్రామానికి చెందిన ఇప్పిలి లక్ష్మి(74) మంగళవారం ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఇప్పిలి కుమార్ రాజు, ఇప్పిలి మురళి కృష్ణ, ఇప్పిలి లక్ష్మణరావులు రెడ్‌క్రాస్ నేత్ర సేకరణ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. జిల్లా రెడ్‌క్రాస్ సమన్వయంతో మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, బి.మనుకుమార్‌లు కార్నియాలను సేకరించి, వాటిని విశాఖలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్‌లు కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 45–50 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, ఆ వ్యక్తి సిమ్మెంట్ రంగు షార్ట్, నీలం రంగు, తెలుపు చెక్స్ ఉన్న షర్ట్ వేసుకుని ఉన్నాడని తెలిపారు. అయితే ఈ వ్యక్తి మంగళవారం గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి శవపంచనామ నిమిత్తం తరలించారు. మృతుని వివరాలు తెలిసినట్లయితే పలాస జీఆర్పీ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు ఫోన్ 92475 85743 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
కిడ్నాప్‌కు యత్నంపై ఫిర్యాదు
టెక్కలి రూరల్: మండలంలో లింగాలవలస గ్రామంలోని పీహెచ్‌సీకి సమీప వెల్‌నెస్ సెంటర్‌లో కాంట్రాక్ట్ బేసిక్‌లో పనిచేస్తున్న ఒక మహిళతో, గార మండలం బందరవానిపేటకు చెందిన వారాది రాంబాబు అనే వ్యక్తి మంగళవారం ఆమె పనిచేస్తున్న స్థలానికి వచ్చి గొడవకు దిగాడు. అనంతరం ఆమెను బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్ల: ఏపీఈఏపీ సెట్–2026 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సులతో పాటు డీఫార్మసీ, పార్మా–డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసినట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసి పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కళాశాలలు, కోర్సుల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. 20వ తేదీన ఆప్షన్స్ మార్పునకు అవకాశం ఉంటుందన్నారు. కళాశాలలు, కోర్సుల కేటాయింపు జాబితా 23వ తేదీన వెల్లడించనున్నామని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలని తెలిపారు.


