శ్రావణం.. శుభప్రదం | - | Sakshi
Sakshi News home page

శ్రావణం.. శుభప్రదం

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

● రేపటి నుంచి శ్రావణ మాసం ● పూజలకు ఆలయాలు ముస్తాబు

● రేపటి నుంచి శ్రావణ మాసం ● పూజలకు ఆలయాలు ముస్తాబు

శ్రీకాకుళం కల్చరల్‌: శుభాలకు నిలయం శ్రావణ మాసం అంటారు. ఈ మాసంలో శుభకార్యాలతో పాటుగా, శుభ ముహుర్తాలు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు. శ్రావణ మాస శోభ ప్రతి ఇంటా కనిపిస్తుంది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలకు ఒక ప్రత్యేకత ఉంది. దీంతో ఆలయాల్లో కూడా మహిళలు పూజలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణంలో 5 శుక్రవారాలు, 4 మంగళవారాలు వస్తున్నాయి. 14న మొదటి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలు, ఇళ్లల్లో పూజల కోసం మార్కెట్‌లో కొనుగోళ్లు చేస్తున్నారు.

ఆలయాలు సన్నద్ధం

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని పలు అమ్మవారి ఆలయాలు, దేవీ పీఠాల్లో మహిళా భక్తులు సామూహిక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం విద్యుత్‌ దీపాలు, రంగులతో అలంకరణలు చేశారు. నగరంలో గుజరాతీపేటలోని రాజరాజేశ్వరీ మహాత్రిపుర సుందరీ దేవి పీఠంలో, కత్తెర వీధిలోని రాజరాజేశ్వరీ దేవీ పీఠంలో పూజలు జరగనున్నాయి.

శ్రావణంలో పండగలు ఇవే...

శ్రావణ మాసంలో శుక్రవారాలు, మంగళవారాల్లో పూజలు, నోములు, వ్రతాలు నిర్వహిస్తారు. వీటితో పాటుగా ముఖ్యమైన పండగలు కూడా ఉన్నాయి. ఈనెల 14న మొదటి శుక్రవారం కాగా, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 21న వరలక్ష్మీ వ్రతం, 17న తొలి మంగళవారంతో నోములు ప్రారంభమవుతాయి. 28న శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి, 11న ఆఖరి శుక్రవారం పండుగలు ఉన్నాయి.

మార్కెట్లో సందడి

మార్కెట్‌లో కూడా వస్తువులు అమ్మకాల కోసం ప్రదర్శన చేస్తున్నారు. అమ్మకానికి అమ్మవారి ముఖాలు, కలశాలు ఏర్పాటు చేసుకునే విధంగా అమ్మవారి ఆకారం, అమ్మవారి కాళ్లు, చేతులు, అమ్మవారిని అలంకరించేందుకు ఆభరణాలు, అమ్మవారిని ప్రతిష్టించేందుకు కలువ పూలు కూడా అమ్ముతున్నారు. వీటి ఖరీదు సైజుల బట్టి రూ.1,000ల నుంచి రూ.2000ల వరకు అమ్ముతున్నారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికి విశేష పూజలు, కుంకుమార్చనలు మహిళలంతా కలిసి సామూహికంగా ఆలయాల్లో, ఇళ్ల వద్ద చేస్తారు. దీనికోసం ఎక్కువగా పూలు ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో చామంతులు కేజీ రూ.800లు, గులాబీలు కేజీ రూ.600లు, బంతిపూలు కేజీ రూ.500లు, విరజాజులు కేజీ రూ.వెయ్యి, కొబ్బరికాయ ఒకటి రూ.30లు, అరటిపండ్లు పెట రూ.80లుగా అమ్ముతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement