రాయగడ: విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడంతోపాటు వారిలో సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయగడ అపరాజిత సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో మహార్షి విద్యాలయం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. స్వాతంత్య్ర వేడులను పురస్కరించుకుని.. నిర్వహించిన ఈ పోటీల్లో 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ 322–సి 4 జిల్లా గవర్నర్ అశ్విన్ కుమార్ దాస్ హాజరై ప్రసంగించారు. రచన, చిత్రకళ ద్వారా తమ ఆలోచనలు, దేశభక్తి భావాలను వ్యక్తికరించేందుకు విద్యార్థులకు ఈ తరహా పోటీలను సంస్థ నిర్వహించడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అపరాజిత అధ్యక్షురాలు పి.కల్యాణి మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి పోటీలు వారిలో ఆలోచన శక్తి కలుగుతుందన్నారు. క్లబ్ కార్యదర్శి ఎస్.శ్రావణి, కోశాధికారి రంజిత్ బిశోయ్, ఉపాధ్యాక్షురాలు కె.శరణ్య సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. జోన్ చైర్‌పర్సన్ జి.రామకృష్ణ, తదితరులు సహకరించారు. పోటీలకు న్యాయనిర్ణేతగా మాణిక్యరావు మాస్టారు వ్యవహరించారు. విజేతలకు పంద్రాగస్టు వేడుకల్లో బహుమతులు అందజేస్తామని అపరాజిత క్లబ్ కార్యదర్శి శ్రావణి తెలియజేశారు.


