● గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్
రాయగడ: విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించి భవిష్యత్‌లో అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదిగితే జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమం నిర్వహణ సార్ధకమైనట్టేనని గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్ ఆకాంక్షించారు. జిల్లాలోని గుణుపూర్ ఉన్న గాంధీ ఇన్‌స్టిటూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష దినోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచుకుని భవిష్యత్‌లో దేశానికి సేవలందించే శాస్త్ర వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ధానేకు చెందిన ఏయోనిక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి.ఎన్.రావు గౌరవ అతిథిగా మాట్లాడుతూ.. జాతీయ అంతరిక్ష ప్రాధాన్యత గురించి వివరించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షుడు డాక్టర్ చంద్ర ధ్వజ్ పండ విద్యార్థులు అంతరిక్ష శాస్త్రంపై మరింత జ్ఞానం సంపాదించడంతోపాటు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ నిర్వహణ కమిటీ గుణుపూర్ అధ్యక్షుడు ఆశీష్ పట్నాయక్, కార్యదర్శి అశోక్ కుమార్ మెహెర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యఅతిధిగా హాజరైన దుదూల్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.


