మహానది తీర ప్రాంతాల్లో..
● వరద పరిస్థితిని సమీక్షించిన మంత్రి
భువనేశ్వర్: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిరాకుద్ జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. మహానది మినహా, కుశభద్ర, ఈబ్, జలకా, రుషికుల్య, బైతరణి, బ్రాహ్మణి వంటి మిగతా అన్ని ప్రధాన నదులు ప్రస్తుతం ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. మహా నదిలో పలు చోట్ల నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హిరాకుద్ డ్యామ్‌కు చెందిన 12 గేట్లు తెరిచి ఉన్నాయి. అంచెలంచెలుగా మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కావచ్చు అని మంత్రి తెలిపారు. హిరాకుద్ జలాశయంలో నీటి మట్టం 624.10 అడుగుల వద్ద ఉంది. అంచెలంచెలుగా మరిన్ని గేట్లు తెరవవచ్చని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కటక్, పూరీ, కేంద్రాపడా, జగత్‌సింగ్‌పూర్ మరియు ఖోర్ధా కలెక్టర్లను అత్యంత అప్రమత్తతతో ఉండాలని కోరారు.
మహా నది పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాలను అప్రమత్తం చేశారు. వరద నీరు ముండులికి చేరడానికి సుమారు 40 గంటల సమయం పడుతుంది. ఆ సమయానికి ముండులి నుంచి విడుదల చేసిన నీరు బయటకు వెళ్లిపోతుందని భావిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు చేరడం ప్రారంభమైంది. 14 గేట్లను తెరవడంతో స్థానికుల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి శుక్ర వారం లోక్ సేవా భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక సహాయ కమిషనరు (ఎస్‌ఆర్‌సీ), భారత వాతావరణ విభాగం (ఐఎండీ), జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 15 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. 57 మండలాలు, 446 గ్రామ పంచాయతీలు మరియు 1,362 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. 174 వార్డులతో కూడిన 11 పట్టణ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సుమారు 7 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. 2,88,943 మంది వరద దిగ్బంధంలో చిక్కుకుపోయారు.
సహాయక, రెస్క్యూ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 647 సహాయక కేంద్రాలను తెరిచింది. వరద నీరు తగ్గే వరకు పొడి మరియు వండిన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. పశువుల కోసం 20 ప్రదేశాలలో పశుగ్రాసం ఏర్పాట్లు చేశారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం 21,380 హెక్టార్ల వ్యవసాయ భూమి, సుమారు 700 ఇళ్లు దెబ్బతిన్నాయి. జాజ్‌పూర్, భద్రక్, బాలాసోర్ వంటి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు ఇంకా నీటితో నిండి ఉన్నాయి. కుశభద్ర, ఈబ్, జలకా, రుషికుల్య, బైతరణి, బ్రాహ్మణి నదులు ప్రమాదకర స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల వల్ల ప్రభావితమైన పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, పాత, బలహీనమైన నదీ కట్టల అంచనాను ప్రభుత్వం కోరిందని మంత్రి తెలిపారు. పలు నదులలో నీటిమట్టాలు తగ్గుముఖం పడుతున్నందున, రాబోయే 24 గంటల్లో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి సురేష్ కుమార్ పూజారి నమ్మకం వ్యక్తం చేశారు.


