భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆగస్టు 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె 4వ తేదీ ఉదయం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి బరంపురానికి రైలులో ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన సురక్షితంగా, క్రమబద్ధంగా ముగిసేలా చూసేందుకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) యోగేష్ బహదూర్ ఖురానియా అధ్యక్షతన శుక్ర వారం ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని విభాగాల మధ్య సరైన సమన్వయంతో భద్రతా ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి మినహాయింపు, లోపం లేకుండా ప్రతి ఏర్పాటును క్రమం తప్పకుండా సమీక్షించి పర్యవేక్షించాలని ఆయన అధికారులకు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో కార్యక్రమ వేదిక వద్ద, వీవీఐపీల రాకపోకల మార్గంలో భద్రతా వలయాలు ఏర్పాటు చేయడంతో పాటు, సాంకేతిక, విధ్వంస నిరోధక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. పూర్తి అప్రమత్తతతో అనుక్షణం సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రైల్వే భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రపతి ప్రయాణించే సమగ్ర రైల్వే లైన్‌పై గస్తీని ముమ్మరం చేయనున్నారు. అన్ని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. ప్లాట్‌ఫాం డ్యూటీలో ఉండే రైల్వే ఉద్యోగులను ముందుగానే గుర్తించి వారికి ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా చూసేందుకు పోలీసులు, రైల్వే, సాధారణ పరిపాలన మధ్య పూర్తి సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సీనియర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్‌న్స్ ఆర్. పి. కోచే, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (శాంతిభద్రతలు) సంజయ్ కుమార్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (ఎస్‌ఏపీ) రాజేష్ కుమార్, పోలీస్ కమిషనర్ (భువనేశ్వర్, కటక్ జంట నగరాలు) డా. దేబ్‌దత్ సింగ్, తూర్పు కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ (పీసీఎస్సీ) అలోక్ భోరా, పోలీసు ఇనస్పెక్టరు జనరల్ (సెంట్రల్ రీజియన్) సత్యజిత్ నాయక్, పోలీసు సూపరింటెండెంటు (క్రైమ్ బ్రాంచ్) వివేకానంద్ శర్మ ప్రముఖంగా పాల్గొన్నారు.


