భువనేశ్వర్: మహా నది నీటి ప్రవాహం శర వేగంగా పెరుగుతుంది. జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ శుక్ర వారం ముండలి ఆనకట్ట, నరాజ్ బ్యారేజీని సందర్శించి వరద నీటి విడుదలను అంచనా వేయడంతో పాటు రాష్ట్ర నీటి నిర్వహణ కార్యకలాపాలు సమీక్షించారు. నియంత్రిత నీటి విడుదల నిర్వహణపై ఆమె శాఖా అధికారులతో చర్చలు జరిపారు. నీటి మట్టాలను, నదీ ప్రవాహ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించి దిగువ ప్రాంతాల భద్రతను అనుక్షణం పరిశీలించాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నరాజ్ బ్యారేజీని సందర్శించి కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సిస్టమ్ ద్వారా బ్యారేజీ గేట్ల పని తీరును సమీక్షించారు. క్షేత్రస్థాయి అధికారులు, సాంకేతిక సిబ్బంది రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉంటూ అధునాతన వ్యవస్థ ద్వారా బ్యారేజీ గేట్ల పని తీరును నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. వరద నీటి ప్రవాహం, ఎగువ, దిగువ ప్రాంతాల పరిస్థితులు, శాసీ్త్రయ సమాచారంపై నిరంతర విశ్లేషణ ఆధారంగా బ్యారేజీ గేట్ల నిర్వహణ జరుగుతోందని అధికారులు తెలిపారు.


