రాయగడ: నెలన్నర క్రితం రాయగడలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ అనే వ్యక్తిని ఈ మేరకు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులత సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 17 వ తేదీన రాయగడలో గల ఖొల్లిగుడ సమీపంలో హోండా షొరూం కు దగ్గరలో ఉన్న మైదానంలో దుర్వాసన వస్తున్న బ్యాగును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చందిలి పోలీసులు బ్యాగులో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి ఫొటొను సామాజిక మాధ్యమాల్లో, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఆమెను గుర్తించలేకపొయారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ కేసును ప్రత్యేకంగా పరివేక్షించిన ఎస్పీ రాజ్ ప్రసాద్ సీసీ టీవీ పుటేజ్‌లు, సైబర్ సెల్ సాంకేతిక ఆధారాలు, వివిధ ప్రాంతాల్లో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిందితుడి కదలికలను విశాఖపట్నం నుంచి రాయగడ వరకు గుర్తించారు. ఈ ఆధారాలపై విశాఖపట్నం లోని కంచెరపాలెంలో ఉంటున్న బొలిశెట్టి సురేష్ కుమార్‌ను గురువారం నాడు అరెస్టు చేసి అతడిని విచారించగా ఈ హత్యను తానే చేసినట్లు అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. విజయవాడకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగిందని, వివాహం చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలో ఆమెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో పెట్టి అంద్రప్రదేశ్ నుంచి రాయగడ కు తీసుకువచ్చి హోండా షొరూం సమీపంలో పడేసినట్లు విచారణలో తెలింది. నిందితుడిని కోర్టుకు తరలించినట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఎస్పీతో పాటు ఎస్‌డీపీఓ గౌర హరి సాహు, చందిలి ఐఐసీ తదితరులు ఉన్నారు.


