పర్లాకిమిడి: గోహత్య బంద్ చేయాలని, గోవులను కబేళాలకు తరలిస్తున్న వ్యక్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం పర్లాకిమిడి ఫారెస్టు గేటు నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భజరంగ్ దళ్ గోసేవా, సురక్షా ప్రభారి మనోజ్‌దాస్ తెలిపారు. స్థానిక ఓం కాంప్లెక్సు వద్ద ఆదివారం గోసమ్మాన్ అభియాన్ జిల్లా అధ్యక్షుడు గిన్ని కూర్మారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని బ్లాక్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ర్యాలీ నిర్వహించి వినతిపత్రాలు అందిస్తామని చెప్పారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు. రామేష్ పాత్రో, విశ్వ హిందూ పరిషత్ నగరధర్మ రక్షకులు సత్యనారాయణ సాహు, తదితరులు పాల్గొన్నారు.
ఘాట్ రోడ్డులో కూలిన చెట్లు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి నక్కమామ్ముడి పంచాయతీ ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి వానలు కురిసి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చెట్లు నేలకూలాయి. అగ్నిమాపక సిబ్బంది ఆదివారం ఉదయం నుంచి శ్రమించి రాళ్లు, చెట్లను తొలగించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
జయపురం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జయపురం స్వచ్ఛంద సంస్థ సోషియల్ ఎన్విరోన్‌మెంటల్, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా), స్థానిక బంధన్ బ్యాంక్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం జయపురం సమితి దులిగుడ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురం తెలుగు సాంస్కృతిక నిర్వహిస్తున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాలకు చెందిన 35 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, బ్యాంక్ సిబ్బంది, సీవా కార్యకర్తలు పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీవా కార్యదర్శి ప్రతాప్‌కుమార్ పట్నాయక్ మాట్లాడుతూ.. వన మహోత్సవాల సందర్భంగా తమ సంస్థ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతీ వారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క వారం మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. గ్రామాల్లో హరిత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీవా కార్యకర్తలు కె.మోహన్ రావు, ఎస్.రాజశేఖర్, బంధన్ బ్యాంక్ అధికారులు స్థిత ప్రజ్ఞ, గోపాల కృష్ణ పాడీ, సంభాన విశ్వనాథ్, శ్రీయ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.


