● రాగల 3 రోజులు భారీ వర్షాలు
● రెడ్ అలర్ట్ జారీ
భువనేశ్వర్: వాయువ్య బంగాళా ఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆది వారం తెలిపింది. ఈ వ్యవస్థ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో పారాదీప్, సాగర్ దీవుల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటుతుందని అంచనా. రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ఐఎండీ ముందస్తు సమాచారం జారీ చేసింది. సోమవారం సుందర్‌గడ్, కెందుఝొర్ మరియు మయూర్‌భంజ్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, జగత్‌సింగ్‌పూర్, కటక్, అంగుల్, ఢెంకనాల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేశారు. సోమవారం ఒడిశా తీర ప్రాంతం పరిసరాల్లో గాలివానల వాతావరణం ఉంటుంది. గాలి వేగం గంటకు 55 నుంచి 65 కిలో మీటర్ల వరకు చేరి గరిష్టంగా గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 29 వరకు ఒడిశా తీరం వెంబడి, తీరానికి దూరంగా సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ముందస్తు జాగ్రత్త సమాచారం జారీ చేశారు.


