రణస్థలం: రాజకీయ వేధింపుల్లో భాగంగానే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా ఆరెస్టు చేశారని కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు ఆరోపించారు. కొవ్వాడ సముద్రతీరంలో ఆదివారం మాట్లాడు తూ.. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యగా మార్చి కుట్ర పూరితంగా తొలుత సీదిరి కుమారుడిని, ఆపై సీదిరిని అరెస్టు చేయడం తగదన్నారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాల కు పాల్పడుతున్న కూటమి నాయకులకు రానున్న ఎన్నికల్లో మత్స్యకార ప్రజలంతా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘ కన్వీనర్ బడి రాంబాబు, కొవ్వాడ మాజీ సర్పంచ్ అల్లిపల్లి అప్పన్న, మత్స్యకార నాయకులు సూరాడ అప్పన్న, ఎం.మల్లిబాబు, యు.పోలయ్య, వి.పండువాడు, గనగళ్ల రాముడు, మత్స్యకారులు పాల్గొన్నారు.


