పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరం వద్ద రఽథయాత్ర సందర్భంగా మీనా బజార్‌ను ఏర్పాటుచేశారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో రంగులరాట్నం నుంచి ఒక బాలుడు కిందకు దిగి వచ్చినప్పుడు అక్కడ విద్యుత్ తీగలు తగిలి అస్వస్థతకు గురై అచేతనంగా పడిపోయాడు. వెంటనే జిల్లా ప్రధాన ఆస్పత్రికి బాలుడిని తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన బాలుడు స్థానిక 15వార్డులో మహిళా కళాశాల సమీపంలో ఆటో నడుపుతున్న మోహన్ బెహరా కుమారుడు వినోద్ బెహరా (17)గా పోలీసులు గుర్తించారు. రాత్రి అయినందున ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగలేదు. అయితే మృతిచెందిన బాలుడు వినోద్ బెహరా హార్టు సమస్యలో మృతిచెందాడని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా, లేదు తమ కొడుకు రంగులరాట్నం వద్ద విద్యుత్‌ఘాతంలో మరణించాడని తండ్రి మోహన్ బెహరా చెబుతున్నాడు. వచ్చేనెల తమ కుమారుడు పాలిటెక్నిక్‌లో డిప్లమా కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉందని తండ్రి విలేకరుల వద్ద విలపించాడు. అయితే గురువారం పొద్దుపోయిన తర్వాత ఆస్పత్రి నిబంధనల మేరకు పోస్టుమార్టం జరగలేదు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ జిల్లాకేంద్రం ఆస్పత్రి వద్ద మృతుడు వినోద్ బంధువులు, తల్లిదండ్రులు, వీఽధిజనం విచ్చేసి తమకు నష్టపరిహారం అందేవరకూ పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని ఆస్పత్రి, పోలీసులతో ఘర్షణ పడ్డారు. దీంతో మధ్యాహ్నం వరకూ పోస్టుమార్టం జరగలేదు. అనంతరం జిల్లా కలెక్టర్ వద్ద ఆటోమోహాన్ బెహారా మృతుని వివరాలు, ఆధార్ కార్డు అందజేశారు. అనంతరం పోస్టుమార్టం జరిపి శవాన్ని వారి బంధువులకు అందజేశారు.


