● 100 ఫోన్లు గుర్తించి అప్పగించిన పోలీసులు
రాయగడ: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లు తిరిగి దొరకదనే భావనలో ఉన్న బాధితులకు జిల్లా పోలీసులు తీపి కబురు చెప్పారు. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిల్లో పోయిన లేదా చోరీకి గురైన వంద మొబైల్ ఫోన్లను సైబర్ విభాగం సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకుని.. వాటిని అసలైన యజమానులకు సోమవారం అందజేశారు. జిల్లాలోని చందిలి రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజ్ ప్రసాద్ సమక్షంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో మోబైల్ ఫోన్లను బాధితులకు పంపిణీ చేశారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ సెల్ అధికారులు మోబైల్ ఫోన్లను ట్రాక్ చేసి వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. ఎవరిదైనా మోబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్‌లో కూడా వివరాలు నమోదు చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోయిన మోబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోయిన ఫోన్లను తిరిగి అందించిన పోలీస్ శాఖకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.
గ్రీవెన్స్‌సెల్‌లో 71 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సమావేశం హాల్‌లొ సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 71 వినతులను స్వీకరించారు. ఇందులొ 21 గ్రామ సమస్యలు కాగా మిగతా వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. 13 సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు. మరో ముగ్గురుకి రెడ్ క్రాస్ నుంచి రూ. 5 వేల చొప్పున్న ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఎస్పీ రాజ్ ప్రసాద్, జిల్లా పరిషత్ అదనపు ముఖ్యకార్యనిర్వాహక అధికారి క్షీరాబ్ధి తనయ సాహు పాల్గొన్నారు.
సృజనాత్మకత పోటీలపై అవగాహన
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ఇన్నోవేషన్ పోటీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పోటీ 2026 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశ్వ విద్యాలయ పీజీ కోర్సు అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు పెంచుకోవాలని, స్థానిక, సామాజిక సమస్యల పరిష్కారానికి కొత్త పరిష్కారాలు కనుగొనాలని ఉద్బోధించారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ వాణిజ్య విభాగ ఆచార్యులు, పోటీ 2025 కోఆర్డినేటర్ సచిన్ కుమార్ నాయిక్ ఒడిశా ప్రభుత్వ స్టాఫ్ ఆఫ్ పోటీ 2026 లక్ష్యాలను వివరించారు. పోటీల్లో పోటీ ప్రక్రియ, అర్హతలు, విభాగాలు, మూల్యాంకనం, ప్రతిపాదన సమర్పణ ఉంటాయని ఇవి మూడు దశలలో నిర్వహిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో సింగిల్ పాయింట్ కాంట్రాక్ట్ అధికారి డాక్టర్ అరుణ కుమార్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వివిద విభాగాల నుంచి 100 మందికిపైగా డిగ్రీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.


