భువనేశ్వర్: తమిళనాడు నంగునేరి తోటాద్రి పీఠాధిపతి, రామానుజ సమాజం జగద్గురు శ్రీ మధుర కవి పొన్న పాపన్న రామానుజ జీయర్ స్వామిజీ పూరీ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర స్వామి ఛారిటబుల్ ట్రస్ట్ వర్గీయులు సాదరంగా స్వాగతం పలికారు. లోక్‌నాథ్ ఆలయం సమీపంలోని శ్రీ బాలాజీ ఆలయ ప్రాంగణంలో పాదుక పూజ, పుష్పాల సమర్పణ, వేద విద్యార్థులు వేద గానంతో ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా స్వామిజీ శ్రీ బాలాజీని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సాధువులను ఆశీర్వదించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం పూరీకి వేంచేసిన స్వామి మధుర్ కవిని బాలాజీ ఆలయ ప్రాంగణంలో వివిధ మఠాధిపతులు, సాధువులు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలాజీ ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ ఛైర్మన్ మరియు జీయర్ స్వామి మఠం మహంత్ స్వామి ఇందిరా రమణ రామానుజ దాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూరీ ఉత్తర పార్శ్వ మఠం మహంత నారాయణ్ రామానుజ దాస్ మరియు అనేక మంది సాధువులు, ఆచార్యులు, శిష్యులు ట్రస్ట్ సభ్యులు స్వామి సుదర్శన్ రామానుజ దాస్, సురేష్ శర్మ, సీనియర్ పాత్రికేయుడు విష్ణుదత్త దాస్ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.


