భువనేశ్వర్: రాష్ట్రంలో సోమవారం 2 న్యాయ స్థానాలకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. యంత్రాంగాన్ని పరుగులు తీయించింది. న్యాయ స్థానం ఆవరణలో సాధారణ ప్రజానీకం, సిబ్బంది బెంబేలెత్తారు. పోలీసులు, బాంబు నిర్వీర్య సిబ్బంది హుటాహుటిన బాంబు బెదిరింపు ప్రాంగణాలకు చేరారు. అంగుల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపుతో కూడిన ఒక ఈ–మెయిల్ కలకలం రేపింది. ఆ ఈమెయిల్ అందిన తర్వాత కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. బాంబు నిర్వీర్య బృందంతో డాగ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణానికి చేరి తనిఖీలు చేపట్టారు.
సంబల్‌పూర్ కోర్టుకు బెదిరింపు
సంబల్‌పూర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపుతో కూడిన ఒక ఈ–మెయిల్ వచ్చింది. రిజిస్ట్రార్‌కు బెదిరింపు ఈ–మెయిల్ అందింది. కోర్టు ప్రాంగణంలో పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలను మోహరించారు. కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, గాలింపు చర్యలు చేపట్టారు.


