ఖొడి ప్రసాదం
భువనేశ్వర్:
శ్రీ క్షేత్రం యాత్ర సందడితో కళకళలాడుతోంది. మరో వైపు స్వామి యాత్ర కోసం ఉవ్విళూరుతున్నాడు. యాత్రకు మరో రెండు రోజులు ఉండగానే స్వామి శోభాయమానంగా భక్త జనుల మధ్య ప్రత్యక్షం కావాలని సమాయత్తం అవుతున్నాడు. పవిత్ర ఒనొసొరొ లేదా అనవసర త్రయోదశి తిథి పురస్కరించుకుని సోమ వారం శ్రీ మందిరంలో తెర చాటున దేవతా మూర్తులకు ఘొణా లగ్గి, శ్రీ పాయర్ ముద్దా సేవలు నిర్వహించారు. ఈ సేవలో దేవతా మూర్తుల శ్రీ అంగం ఉదరం నుంచి చికిత్స సమయంలో వస్త్రాలు తొలగించి నూతన బాసుంగ పట్టొ (చికిత్స సమయంలో వినియోగించే ప్రత్యేక వస్త్రం) ధరిస్తారు. ఇంతటితో అనారోగ్య సేవలకు ముగింపు పలుకుతు శ్రీ విగ్రహాలకు శ్రీ పాయర్ ముద్దా సేవ నిర్వహిస్తారు.
●ఈ ఘొణా లగ్గి సేవలో స్వామి వారికి ప్రత్యేక సుగంధ లేపనం, చందనం, కర్పూరం, కస్తూరి మొదలైన ఔషధీయ సుగంధ ద్రవ్యాలను పూస్తారు. ఒణొసొరొ కాలంలో జరిగిన వైద్య సేవల చివరి దశలో భాగంగా ఇది నిర్వహిస్తారు. దీని ద్వారా స్వామివారు సంపూర్ణ ఆరోగ్యంతో, దివ్య కాంతితో భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని భావిస్తారు.
●అలాగే శ్రీ పాయర్ ముద్దా సేవ కూడా ఒణొసరొ ముగింపు దశలో జరిగే ఒక ప్రత్యేక ఆలయ ఆచార సంప్రదాయం. ఇందులో స్వామి వారి సింగారం, వస్త్రాలంకరణ, అంతర్గత ఏర్పాట్లు పూర్తయ్యాయని సూచిస్తూ సంప్రదాయబద్ధంగా ముగింపు సంకేతం ముద్ర, సీలుకు సంబంధించిన ఆచారం ముద్దా నిర్వహిస్తారు.
●ఈ రెండు ఆచారాలు భగవంతుడు అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడనే భావాన్ని ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైన ఆచారాలు. అనంతరం నేత్రోత్సవం నవయౌవన దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తవుతాయి. ఏకాంత గదిలో గోప్య సేవలు తర్వాత అనారోగ్యంతో ఉన్న మహా ప్రభువు కోలుకున్నారు. ఈ విషయాన్ని సేవకులు గజపతి మహారాజ్‌కు కూడా తెలియజేశారు. రథ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభించాలని రాజా వారు అభ్యర్థించారు.
సోమవారం శ్రీ మందిరంలో ఘొణా లగ్గి సేవ నిర్వహించారు. ఘొణా లగ్గి నియమం ప్రకారం మహా ప్రభువుపై కప్పిన పాత బాసుంగ పట్టు వలువను తొలగించి పటరా వర్గం సేవకులుతో తయారు చేసిన కొత్త బాసుంగ పట్టు వలువని ప్రతిష్ఠించడం ఒక సంప్రదాయం. దీని తర్వాత శ్రీ అంగంపై శ్రీ ముఖ హొత్తా (మూల విరాటుల ముఖ కాంతుల పునరుద్ధరణ) నిర్వహించడం క్రమ పద్ధతి. దీని కోసం దైతపతి సేవకులు ముందు రోజు రాత్రి నుంచి పొద్దుపోయేంత వరకు నిరవధికంగా సన్నాహాలు చేశారు. సోమవారం వేకువ జాము వరకు ఈ సన్నాహాలు కొనసాగాయి. మరో వైపు ఈ రోజు మహా ప్రభువు దేహాన్ని ప్రకాశింపజేయడానికి శుద్ధ సువార్ సేవకుని ఇంటి నుండి ఖొల్లి ప్రసాదం అనే దివ్య లేపనాన్ని సమర్పించారు. దీనితో పాటు ఖొడి ప్రసాదానికి సంబంధించిన ఒక ఆచారాన్ని కూడా నిర్వహించారు. దీని తర్వాత అనారోగ్యంతో ఉన్న మహా ప్రభువు తన యవ్వనాన్ని తిరిగి పొందుతారు.
●శ్రీ జగన్నాథ సంస్కృతి శాసీ్త్రయ ఆధారాలతో ఫులూరి తైలం, ఓష లగ్గి, దశ మూలికల లగ్గి, సర్వాంగ చందనం, రాజ ప్రసాదం సమర్పిండంతో పక్షం రోజుల అస్వస్థత నుంచి స్వామి క్రమంగా కోలుకున్నాడు. ఆపై శుద్ధ సువార్ వర్గీయులు తయారు చేసిన దివ్య లేపనం (ఖొల్లి) ఒక వెండి పాత్రలో ఉంచి ఖొల్లి ప్రసాదంగా దైతపతి సేవకులకు అందజేయడంతో మహా ప్రభువు దేహానికి పూయడంతో స్వామి దేదీప్య శోభ క్రమంగా కాంతులీనుతుంది. ఖొల్లీ పూయడానికి ముందు భగవంతునికి దేహానికి సంబంధించి ఒక రహస్య ఆచారంలో భాగంగా గోప్యతను పాటిస్తూ దైతపతి, పతి మహా పాత్రో సేవకులు విగ్రహ దేహాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో రక్త వర్ణం వస్త్రంతో కప్పుతారు. దీని తర్వాత అమావాస్యకు ముందు చివరి ఘట్టంగా దైవ విగ్రహం దేహానికి ఖొల్లి దివ్య లేపనం పూత పూర్తి చేయడం ఆచారం.
●ఈ ఖొల్లీని శుద్ధ సువార్ వర్గం తమ ఇళ్లలోనే శుచి శుభ్రతతో తయారు చేస్తారు. ముందు రోజు రాత్రి సంధ్య ధూపం తర్వాత ఖొల్లీ తయారు చేసి శుద్ధ సువార్ కుటుంబంలో మహిళలు మట్టి పాత్రలో శుచిగా భద్రపరుచుతారు. ఘంటానాదం చెవిన పడడంతో రక్షణ కోసం స్వామిని ప్రార్థించి ఛాత్ర ఛాయలో సురక్షితంగా తరలించేందుకు సేవక వర్గానికి అందజేస్తారు. ఘంటానాదంతో ఛాత్ర ఛాయలో ఖొల్లీ పాత్రని అత్యంత జాగరూకతతో శ్రీ మందిరం ఏకాంత గదికి తరలించారు. జగన్నాథుడు, బలభద్ర స్వామి, దేవీ సుభద్ర అనే ముగ్గురు దేవతలకు ఒక్కో ప్రతినిధిగా ముగ్గురు సేవకులు ఊరేగింపుగా ఖొల్లీ తరలించి దైతపతి సేవకులకు అప్పగించిన తర్వాత రాత్రి పూట ఖొల్లీని స్వామి చవారి దేహంపై పూసి ఆపై రహస్య సేవలు నిర్వహిస్తారు.
దేదీప్య కాంతులతో అశేష భక్త జనానికి ఏడాదిలో తొలి సారిగా ప్రసాదించే దర్శనం కావడంతో ఒణొసొరొ అనంతర తొలి దర్శనం నవ యవ్వన శోభతో నేత్రోత్సవంగా భక్త జన హృదయాల్లో నిత్యం కాంతులీనుతుంటుంది.
ఘొణా లగ్గి సేవలో భాగంగా మూల విరాట్ల దేహానికి ఖొల్లీ దివ్య లేపనం పూర్తి కావడంతో శారీరక దారుఢ్యం నిర్ధారించుకుని శ్రీ ముఖ శృంగారాానికి మెరుగులు దిద్దడంతో స్వామికి నవ యవ్వన శోభ రంగరించుకుంటుంది. దీని కోసం దత్త మహా పాత్రో సేవకులు తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసిన ఖొడి ప్రసాదాన్ని సమర్పిస్తారు.


