భువనేశ్వర్: పూరీ జిల్లా కొణాస్ మండలం జగులపడ వద్ద శుక్రవారం దయా నదిలో పడిన మత్స్యకారుడు గల్లంతయ్యాడు. చేపలు పడుతుండగా పడవ నుంచి ప్రమాదవశాత్తు జారి పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మత్స్యకారుడు దిబానా బెహెరాగా గుర్తించారు. ఈ వర్షాకాలంలో దయా నదిలోకి తొలిసారిగా వరద నీరు చేరడంతో అతను తన తండ్రి ప్రకాష్ బెహెరాతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపలు కోసం వల విసురుతున్నప్పుడు అదుపు తప్పి నదిలో పడిపోయినట్లు సమాచారం. తక్షణమే రక్షించడానికి అతని తండ్రి ప్రయత్నించి నీటిలో వెతికాడు. కొడుకు జాడ కొరవడడంతో స్థానికులకు సమాచారం చేరదీసి సాయం కోరాడు. సహాయక సిబ్బంది నది వద్దకు చేరి స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
అడవి పిల్లిని రక్షించిన
అటవీశాఖ
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పట్టణం రహదారి పక్కన ఒక గాయపడిన అడవి పిల్లిని గురువారం సాయంత్రం స్థానికులు చూశారు. వెంటనే బలిమెల అటవీ శాఖకు సమాచార ఇవ్వడంతో బలిమెల అటవీ శాఖ రేంజర్ లిస్మితా కౌర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కోరుకొండ పశువైద్య శాలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బలిమెల అటవీ కార్యాలయంలో 10 రోజులు ఉంచి, అనంతరం పూర్తి ఆరోగ్యంతో అడవిలో విడిచిపెడతామని తెలిపారు.
సోంపేట: మాకన్నపురం పంచాయతీ శారదాపురంలో శుక్రవారం సాయంత్రం కోతులు దాడి చేయడంతో కోనారి నారాయణరావు, దాసరి నారాయణమ్మ, సార వల్లమ్మతో పాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. బాధితులను కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అధికారులు స్పందించి కోతుల బారినుంచి రక్షణ కల్పించా లని గ్రామస్తులు కోరుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పలాస: కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన బి. సోమశేఖరరావు (48) అనుమానాస్పద స్థితిలో గురువారం రాత్రి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద మృతి చెందాడు. ఈ విషయాన్ని కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అంతరకుడ్డలో గల తన అత్తవారింటికి మూడు రోజుల కిందట వెళ్లాడు. భార్యాపిల్లలను చూసి తిరిగి వచ్చాడు. అతనికి మద్యం అలవాటు బాగా ఉందని, మద్యం తాగడం వల్ల, సరైన ఆహారం లేక పోవడం వల్ల డ్రీహైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ ఎస్‌ఐ సునీల్ చెప్పారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం చేశారు. మృత దేహాన్ని వారి కుటుంబానికి అప్పగించామన్నారు.
పలాస: కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి పరిశీలించారు. మృతుడిని యాచకుడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
‘అర్హుల ఓట్లు పోకూడదు’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హత కలిగిన వారి ఓట్లు పోవడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పరిశీలనలో భాగంగా అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్‌తో కలిసి శుక్రవారం శ్రీకాకుళం విచ్చేసిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్‌ఓ విశ్వేశ్వరరావు, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈఆర్వోలు తప్పకుండా తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించాలని, తక్కువ ఫలితాలు నమోదైన చోట క్షేత్రస్థాయి పర్యటనలు చేసి లోపాలను విశ్లేషించుకోవాలని ఆదేశించారు. అనంతరం 8 నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో తొలుత జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ప్రకారం జిల్లాలో 9,31,640 మంది పురుష ఓటర్లు, 9,48,299 మంది మహిళా ఓటర్లు, 126 మంది ఇతర ఓటర్లతో కలిపి మొత్తంగా 18,80,065 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా 107 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు.


