న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
విద్యా విధానంలో..
● రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
నిత్యానంద గొండో
రాయగడ: రాష్ట్రంలోని విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానం ప్రాంగణంలో నిర్వహిస్తున్న పీఎంశ్రీ వేడుకల ముగింపులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యా విధానంలో కొత్త పుంతలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో 762 పీఎంశ్రీ విద్యాలయాలుగా గుర్తించామని తెలిపారు. దీనిలో భాగంగా రాయగడ జిల్లాలో 15 పీఎంశ్రీ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని వివరించారు. ఈ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి
విద్యార్థులు స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని మంత్రి నిత్యానంద గొండో అన్నారు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు ప్రతిభకు అనుకూలంగా స్కిల్ డవలప్‌మెంట్ వంటివాటిలో ఆసక్తి కనబర్చేలా శిక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పీఎంశ్రీ ఉత్సవాల్లో భాగంగా సభా వేదిక ప్రాంగణంలో మోడల్ పార్లమెంట్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలను కంటికి కనిపించేవిధంగా విద్యార్థులు ప్రదర్శించడం ఆకట్టుకుంది. అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఏవిధంగా సహకరిస్తోందనే విషయమై ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్, ఏడీఈవోలు సస్మిత బెహర, శాంతిలత మున్ని, అదనపు జిల్లా విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి తదితరులు పాల్గొన్నారు.


