జయపురం: పట్టణంలో ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయించాలని జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కార్య నిర్వాహక అధికారి, జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అవిభక్త కొరాపుట్‌లో ప్రధాన కేంద్రమైన జయపురంలో వివిధ భాషల పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి 60 మందికిపైగా జర్నలిస్టులు ఉన్నారన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రెస్‌క్లబ్‌లు ఉన్నా జయపురంలో లేకపోవడం విచారణకరమని పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రబి నాయిక్, కమల బొత్ర, ఎ.వెంకటరావు, అనిత దాస్, జోగేంద్ర సింగ్, సన చౌదరి తదితరులు పాల్గొన్నారు.
సైబర్ పోలీస్‌స్టేషన్ ప్రారంభం
కొరాపుట్: పెరుగుతున్న సైబర్ నేరాలు అరికట్టేందుకు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో డీఎస్–3 సమీపంలోని పాత పోలీస్ అవుట్ పోస్టు ప్రదేశంలో సైబర్ పోలీస్‌స్టేషన్ శనివారం ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ విధానంలో ఈ స్టేషన్ ప్రారంభించారు. జిల్లాకు ఇదే తొలి సైబర్‌స్టేషన్ కావడం గమనార్హం. ఈ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తించనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎస్పీ సంబిత్ సంపత్, నబరంగ్‌పూర్ ఎమ్మల్యే గౌరీ శంకర్ మజ్జి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ శనివారం పరిశీలించారు. దసమంతపూర్ పంచాయతీ కాకలపడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మిస్తున్న తరగతి గదులు, పీహెచ్‌సీకి వెళ్లి అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బాలిగుడ గ్రామంలో పండిస్తున్న కూరగాయల పంటలను చూశారు. అనంతరం చంద్రపడ పంచాయతీ దొరాగుడలో బిజూ పట్నాయిక్ గ్రామీణ పరిశ్రమలను పరిశీలించారు. ఆయనతో పాటు కొరాపుట్ సీడీవె బేణూధర శబర, బొయిపరిగుడ సమితి బీడీవో శుభ్రత సాహు, పంచాయతీ సమితి అధ్యక్షుడు ప్రశాంత కుమార్ గుప్త తదితరులు ఉన్నారు.
బాలుడి దారుణ హత్య
రాయగడ: ఏడేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా గొంతుకొసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికొన వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడు చాటికొన గ్రామానికి చెందిన పురుషోత్తం గంతాయిత్ పెద్ద కొడుకు రుషి గొంతాయిత్‌గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం చాటికొన గ్రామంలోని పాత రైల్వేస్టేషన్ వీధిలో నివసిస్తున్న పురుషోత్తం గంతాయిత్ పెద్ద కొడుకు రుషిని గుర్తు తెలియని కొందరు దుండగులు అపహరించారు. కొద్దిసేపటి తర్వాత బాలుడి మేనమామ సెల్‌ఫోన్‌కు బాలుడు తమ వద్దే ఉన్నాడని, రూ.4 లక్షలు ఇస్తే బాలుడిని తిరిగి పంపిస్తామన్నారు. విషయాన్ని ఒకవేళ పోలీసులకు తెలియజేస్తే బాలుడిని చంపేస్తామని హెచ్చరిస్తూ మెసేజ్ వచ్చింది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం వెతుకున్న పురుషోత్తం గంతాయిత్‌కు ఆ మెసేజ్‌ను చూపించాడు. అయితే అనంతరం శుక్రవారం రాత్రి చుట్టుపక్కలా వెదకడం ప్రారంభించారు. కొద్ది సమయానికే పురుషోత్తం ఉండే ఇంటికి కొద్దిదూరంలో ఉన్న మరో పాత ఇంటి వెనుక ఒక గోనె సంచిలో బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.


