మల్కన్‌గిరి: మల్కన్‌గిరి, కలిమెల, పోడియా సమితుల్లో ప్రతి సమితి నుంచి మూడు గ్రామాలను తీసుకొని వాటిని మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మల్కన్‌గిరి జిల్లా అభివృద్ధికి గానూ ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు గుర్తించిన గ్రామాల్లో వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఆ గ్రామాల్లో ప్రస్తుత అభివృద్ధి పరిస్థితి మరియు అవసరాలు గుర్తించి అంచనా వేయాలని అదేశించారు. ఈ ప్రక్రియకు ప్రతీ సమితి అభివృద్ధి అధికారిని నోడల్ అధికారిగా నియమించారు. అలాగే జిల్లా కేంద్రంలో ఉన్న మల్లికేశ్వర్ ఆలయం, బైరవి ఆలయం పనులు తక్షణమే ప్రారంభించాలని సూచించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, కలెక్టర్ దుర్యోధన్ బోయి తదితరులు పాల్గొన్నారు.


