ఆవిష్కరణలతోనే వికసిత భారత్
జయపురం: విజ్ఞాన, ఆవిష్కరణాత్మక ఆలోచనల ద్వారానే వికసిత భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని విద్యావేత్త, యువ శాస్త్రవేత్త, అవిభక్త కొరాపుట్ తెలుగు తేజం అములూరి విశ్వనాథ్ అన్నారు. శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్‌లో మాట్లాడుతూ ఈ ఏడాది జాతీయ విజ్ఞాన దినోత్సవ థీమ్ ‘విజ్ఞానంలో మహిళలు..వికసిత భారత్ నిర్మాణానికి ప్రోత్సాహం’ అని వెల్లడించారు. అవిభక్తి కొరాపుట్( కొరాపుట్, మల్కనగిరి, రాయగడ, నవరంగపూర్) అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో సమగ్ర చర్చలు, ఆధునిక సాంకేతికత అవసరమన్నారు. విద్యాసంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ విజ్ఞాన ప్రదర్శనలు, వర్క్‌షాపులు నిర్వహిస్తూ భవిష్యత్ శాస్త్రవేత్తలకు ప్రేరణ ఇవ్వాలని, అలా చేసినప్పుడే వికసిత భారత్, వికసిత ఒడిశా, వికసిత అవిభక్త కొరాపుట్‌లు సాధ్యమౌతాయని చెప్పారు.
చనిపోయిన కోడి మాంసం తిని నలుగురికి అస్వస్థత
రాయగడ: అనారోగ్యానికి గురై చనిపోయిన నాటుకోడి మాంసాన్ని వండుకుని తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలొని సనోడెంగిలి గ్రామంలో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే కళ్యాణసింగుపూర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుటుగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే సనోడెంగిలి గ్రామానికి చెందిన పొతే కడ్రక, కుడుంజీ కడ్రక, పవులి కడ్రక, మాల కడ్రకలు వారి ఇంట్లో పెంచుతున్న ఒక నాటుకోడి చనిపోయింది. దానిని పారవేయడమెందుకని కోసి మాంసాన్ని వండుకుని అందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. అర్థరాత్రి అయ్యేసరికి ఒకొక్కరికీ వాంతులు పట్టుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు చూసి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
లిక్విడ్ గంజాయి తయారీలో కేరళా స్మగ్లర్లు
కొరాపుట్: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన గంజాయి ఆయిల్ తయారీ పరిశ్రమపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో దక్షిణ పశ్చిమాంచల్ ఐజీ కన్వర్ విశాల్‌సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న కొరాపుట్ జిల్లా జోలాపుట్ రిజర్వాయర్ మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పరిశ్రమపై దాడి చేయగా.. 1,800 లీటర్ల గంజాయి ఆయిల్ పట్టుబడిందన్నారు. దీని విలువ రూ.200 కోట్ల పైబడి ఉంటుందన్నారు. ఈ సమయంలో నలుగురు కేరళ వాసులు ఉన్నారన్నారు. అధునాతన రసాయన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆయిల్ తయారు చేస్తున్నారని చెప్పారు. ఐలాండ్‌కి వెళ్లడానికి బోట్లు వాడుతున్నారని, విద్యుత్ కోసం జనరేటర్లు వినియోగిస్తున్నారని తెలిపారు.ఈ మాఫియా డాన్ జయరాజ్ కేరళా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. టెన్త్ పాస్ అయిన జయరాజ్ యూట్యూబ్ చూస్తూ ఆయిల్ తయారు చేస్తున్నాడని చెప్పారు. కేరళా నుంచి వచ్చి ఒడిశాలో తయారు చేయడం వెనుక నెట్‌వర్క్ ఛేదిస్తామన్నారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్పీ రోహిత్ వర్మను అభినందించారు.
ఆవిష్కరణలతోనే వికసిత భారత్
ఆవిష్కరణలతోనే వికసిత భారత్


