పర్లాకిమిడి: చంద్రగ్రహణం వల్ల పట్టణంలో అన్ని దేవాలయాలు, మఠాలు ఉదయం పదిగంటల నుంచి మూసివేశారు. రాజవీధిలో ఉమారామలింగేశ్వర మందిరం, ఏకాంబరీశ్వర మందిరం, గోపీశ్వర మందిరం, శ్రీజగన్నాథ మందిరం, పెద్ద రాధాకాంత మఠంలో రాధాగోవింద ఆలయం తదితర దేవాలయాలను మూసివేశారు. తిరిగి రాత్రి సంప్రోక్షణ అనంతరం తెరువబడతాయని పూజారులు తెలియజేశారు. పెద్ద రాధాకాంత మఠంలో 24 గంటలపాటు హరేరామ.. హరే కృష్ణ భజన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో చంద్ర గ్రహణం పురస్కరించుకుని అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
రాయగడ: చంద్ర గ్రహణం కారణంతో మంగళవారం పట్టణంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ప్రధానంగా మజ్జిగౌరీ మందిరాన్ని ఉదయం 6.15 గంటలకు మూసివేశారు. అలాగే స్థానిక కరణం వీధికి వెళ్లే మార్గంలో ఉన్న కోదండరామ మందిరం, మల్లికార్జున మందిరాలు మూతపడ్డాయి. స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరాన్ని కూడా మూసివేశారు. అయితే మజ్జిగౌరీ మందిరానికి కొంతమంది ఆంధ్రకు చెందిన భక్తులు రావడంతో వారు బయటే పూజలు చేసుకుని తిరుగుముఖం పట్టారు.


