బూర్జ: మండలంలోని కొరగాం గ్రామానికి చెందిన పిన్నింటి వెంకన్న అలియాస్ వెంకటరమణకు చెందిన 17 గొర్రెలు, ఒక మేక కుక్కల దాడిలో మృతి చెందినట్లు గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్ సతీష్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి గ్రామ సమీపంలో గొర్రెలు, మేకల మందను ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున మందపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. మృతి చెందిన జీవాలు విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని పశువైద్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత సభ్యులు కోరుతున్నారు.
బొరిగిపేటలో అనుమానితుల కలకలం
టెక్కలి రూరల్: బొరిగిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కొందరు అనుమానిత వ్యక్తులు సంచరించడంతో గ్రామస్తులు వెంబడించారు. ఐదుగురిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వెంటనే విద్యుత్ స్తంభానికి కట్టేసి ప్రశ్నించారు. వివరాలు చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిర్వాసితుల హామీ నెరవేర్చేదెప్పుడు?
కొత్తూరు: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వంశధార నిర్వాసితుల సంఘం నాయకుడు, మెట్టూరు బిట్–2 సర్పంచ్ యర్లంకి ధర్మారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ అన్నారు. మెట్టూరులో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో నిర్వాసితలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకుంటామని ప్రస్తుత సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కృషి మేరకు నిర్వాసితులకు అదనపు ప్యాకేజి కింద రూ. 217 కోట్లు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలతో అదనపు ప్యాకేజీలు అందుకోని 30 శాతం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందివ్వాలన్న ఆలోచన లేకపోవడం అన్యాయమన్నారు. సమావేశంలో సర్పంచ్ పెదకోట సాదుబాబు, మురపాక శంకరరావు, పార్టీ నాయకులు నిమ్మగడ్డ కృష్ణారావు, యర్లంకి ధర్మారావు, సవర రమేష్, మఠం పూర్ణ, దుర్యోధన, మణి, రమణ తదితరుఉల పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పిద్దాం
శ్రీకాకుళం: ఉపాధ్యాయులతో పాటు ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపత్‌రావు కిషోర్‌కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా భారత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడిని చులకనగా తీసుకోవద్దని, ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఉచితంగా ఇస్తూ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం రణభేరీ త్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గస్థాయి, జిల్లా కేంద్ర స్థాయి, రాష్ట్రస్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్‌మూర్తి, గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, వై.ఉమాశంకర్, కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శి డి.ప్రకాశరావు, జి.నారాయణరావు, బి.శంకరరావు, జి.సురేష్, టి.భాస్కరరావు, ఎం.మురళి ప్రకాష్, గణపతరావు, జైశ్రీరామ్, ఎం.వి.రమణ, బి.గౌరీశ్వరరావు పాల్గొన్నారు


